అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారులు హడలెత్తిపోతున్నారు. ఎక్కడ తాము దొరుకుతామోనని ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల ఏసీబీ అధికారులు(ACB Officers) దూకుడు పెంచారు. బాధితుల ఫిర్యాదు మేరకు లంచాలు తీసుకుంటున్న వారిని వల పన్ని పట్టుకుంటున్నారు. అంతేగాకుండా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న అధికారులపై సైతం దాడులు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నారు. అవినీతి ఎక్కువగా జరిగే కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో సైతం ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్(Hyderabad) నగరంలో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ACB Raids | భారీగా అవినీతి ఆరోపణలు
విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ (ADE Ambedkar) ఇంట్లో ఏసీబీ సోదాలు చేపడుతోంది. నగరంలోని 15 ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు చేపట్టారు. మణికొండ ఏడీఈగా పని చేస్తున్న అంబేడ్కర్‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన అనేక అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్ (Madhapur) సహా పలుచోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ACB Raids | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.