అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heroine Meena | 90వ దశకంలో తనదైన నటనతో దక్షిణాది సినీ ప్రపంచంలో ప్రత్యేక ముద్ర వేసిన కథానాయిక మీనా. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, అప్పటి స్టార్ హీరోలందరితో నటించిన ఆమె, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రసీమలందరి అభిమానాన్ని చూరగొంది.
తన నటనతో ప్రేక్షకులను అలరించిన మీనా, సినీ కెరీర్ పీక్‌లో ఉన్నపుడే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను వివాహం చేసుకుని వ్యక్తిగత జీవితాన్ని ప్రారంభించింది. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది, ఆమె కూడా ‘తెరి’ (తెలుగులో ‘పోలీసోడు’) సినిమాలో విజయ్ కుమార్తెగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Heroine Meena | మీనా ఎమోషనల్ కామెంట్స్..
అయితే, 2022లో మీనా(Heroine Meena) జీవితంలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. కొవిడ్ అనంతర సమస్యలతో ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఈ దురదృష్టకర ఘటన తర్వాత మీనా తన కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవితం కొనసాగిస్తోంది. తాజాగా జీ తెలుగు ప్రసారం చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో నటుడు జగపతిబాబుతో మాట్లాడిన మీనా, తన జీవితం గురించి ఎంతో భావోద్వేగంతో వివరించింది. “నా భర్త మరణించిన వారం రోజుల్లోనే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానని పుకార్లు పుట్టించారు. తర్వాత కూడా అలాంటి వార్తలు ఆగలేదు. ఎవరో నటుడు విడాకులు తీసుకున్నాడంటే వెంటనే నన్ను అతనితో లింక్ చేస్తున్నారు. అసలు వాళ్లకు కుటుంబాలున్నాయా? మంచితనముందా? అనే సందేహం కలిగింది. చాలా బాధగా అనిపించింది” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
కేవలం వ్యక్తిగత జీవితమే కాకుండా, తన కెరీర్ తొలి దశలో ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా మీనా చర్చించారు. “చిన్నప్పటి నుంచి నటిస్తున్నా. అప్పట్లో నిర్మాతల కష్టాలు చూసి చాలా తక్కువ రెమ్యూనరేషన్‌కు సినిమాలు చేశాను. అవి హిట్టయినా, ఎవ్వరూ పట్టించుకోలేదు,” అంటూ గతాన్ని తలచుకున్నారు. మీనా మళ్లీ నటిగా తిరిగి రావడానికి ఓ మలయాళ సినిమా(Malayalam Cinema) కీలకంగా మారిందని చెప్పింది. “నా పాప పుట్టిన రెండేళ్ల తర్వాత మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’(Drishyam) కోసం నన్ను సంప్రదించారు. కానీ పాప కోసం నేను సినిమాలు చేయలేనని చెప్పాను. కానీ, ఆ పాత్రను నన్నే దృష్టిలో పెట్టుకుని రాశారని చెప్పి ఒప్పించారు. అది నాకు మళ్లీ బ్రేక్ ఇచ్చింది. అదే నా రెండో ఇన్నింగ్స్‌కి మొదటి మెట్టు అని వివరించారు. ప్రస్తుతం మీనా సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్నారు. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మూకుతి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’) చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.