అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాల (Brahmotsavam)కు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కల్గకుండా టీటీడీ (TTD) చర్యలు చేపడుతోంది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం అన్నమయ్య భవన్ (Annamayya Bhavan)లో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ అంశాలపై చర్చించారు.
Tirumala | 4,200 మంది పోలీసులతో..
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో 4,200 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు ఏఈవో తెలిపారు. సీనియర్ అధికారితో ప్రతి గ్యాలరీ పర్యవేక్షణ చేపడుతామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ద్వారా రోజుకు 435 బస్సులు నడుస్తున్నాయని, దీని ద్వారా రోజుకు సుమారు 1.60 లక్షల మంది భక్తులకు పికప్, డ్రాప్ సౌకర్యం కల్పించవచ్చని చెప్పారు. తిరుపతిలోని 23 ప్రదేశాలను వాహనాల పార్కింగ్ కోసం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
Tirumala | వాహన సేవలు తిలకించేందుకు..
తిరుమల మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1.85 లక్షల నుంచి 2 లక్షల వరకు భక్తులు కూర్చునే సదుపాయం ఉందని ఏఈవో అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా క్రౌడ్ మూవ్‌మెంట్, రద్దీ పాయింట్లను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.
Tirumala | వీఐపీల కోసం..
బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఇతర వీఐపీలు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే అవకాశం ఉంది. వీఐపీల రాకపోకలకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వెంటనే కౌంటర్ చేసేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలను వినియోగించుకోవాలని అదనపు ఈవో కోరారు.