అక్షర టుడే, వెబ్‌డెస్క్: Karnataka CM | వివాదాస్పద వ్యాఖ్యలతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah) చిక్కుల్లో పడ్డారు. హిందువుల మత మార్పిడిపై వ్యాఖ్యలు చేసి వివాదానికి ఆజ్యం పోశారు. సిద్ధరామయ్య బెంగళూరులో (Bengaluru) విలేకరులతో మాట్లాడుతూ.. హిందూ సమాజంలో (Hindu society) సమానత్వం ఉంటే మత మార్పిడి జరిగేది కాదని సిద్దు వ్యాఖ్యానించారు.
హిందూ సమాజంలో సమానత్వం ఉంటే ఎవరైనా మతం మారడం ఎందుకు?” అని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలను మతం మారమని అడగలేదని, కానీ వారు ఇప్పటికీ మతం మారుతున్నారని, ఎందుకంటే అది వారి హక్కు అని పేర్కొన్నారు. సమానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు ఉనికిలోకి వచ్చింది? మనం అంటరానితనాన్ని సృష్టించామా? ఇస్లాం, క్రైస్తవ మతం లేదా ఏ మతంలోనైనా అసమానతలు ఉండవచ్చు. మేము లేదా బీజేపీ ఎవరినీ మతం మారమని అడగము, కానీ ప్రజలు మతం మారుతారు, అది వారి హక్కు” అని వ్యాఖ్యానించారు.
Karnataka CM | సీఎంపై బీజేపీ ఆగ్రహం
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్దరామయ్యపై బీజేపీ సహా హిందు సంఘాలు (Hindu groups) భగ్గుమన్నాయి. హిందూ సమాజంలో సమానత్వం గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ముస్లింలలో సమానత్వం గురించి మాట్లాడగలరా? అని బీజేపీ ప్రశ్నించింది. హిందువులను లక్ష్యంగా చేసుకుని, కులం, మతం ఆధారంగా ప్రజలను విభజించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించారని మండిపడింది. సిద్ధరామయ్య ప్రకటనపై కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక తీవ్రంగా ఖండించారు. మీకు దమ్ముంటే ముస్లిం సమాజంలో (Muslim community) సమానత్వం గురించి ప్రశ్నించండని సిద్ధరామయ్యకు సవాల్ విసిరారు.
Karnataka CM | మెట్రో స్టేషన్ కు సెయింట్ మేరీ పేరు
బెంగళూరులోని శివాజీనగర్ మెట్రో స్టేషన్‌కు (Shivajinagar Metro station) సెయింట్ మేరీ పేరు పెట్టాలనే ప్రతిపాదనను అంగీకరించిన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి వివాదం సృష్టించారు. సెయింట్ మేరీస్ బసిలికాలో జరిగిన వార్షికోత్సవంలో మాట్లాడిన సిద్దరామయ్య.. శివాజీనగర్ మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెడతామని ఆర్చ్ బిషప్ పీటర్ మచాడోకు హామీ ఇచ్చారు.
ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని, నిబంధనల ప్రకారం అభ్యర్థనను ప్రాసెస్ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై (Congress Party) బీజేపీ విరుచుకు పడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం మరాఠా ఐకాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను (Chhatrapati Shivaji Maharaj) అగౌరవపరిచిందని విమర్శించింది. ఈ అంశంపై మహారాష్ట్ర (Maharashtra) నుంచి కూడా తీవ్ర స్పందనలు వచ్చాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు, ఇది శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని అన్నారు.