అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ (ABVP Telangana University) నాయకులు డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సోమవారం తెయూ గేట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అవలంభిస్తోందని దుయ్యబట్టారు.
విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ (fee reimbursement), స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు కళాశాలల్లో తరగతులకు హాజరుకాలేకపోతున్నారని వాపోయారు. ఎన్నికల సమయంలో మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థులు గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు.
కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ తెలంగాణ సమాజాన్ని నమ్మిస్తూ రోజులు గడుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విద్యార్థి లోకం హెచ్చరిస్తోందని స్పష్టం చేశారు. విద్యాశాఖను తనవద్దే ఉంచుకుని విద్యార్థులను అవస్థల పాలు చేయడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. కార్యక్రమంలో తెయూ ఏబీవీపీ నాయకులు అక్షయ్, అశోక్, మనోజ్, అనిల్, అఖిల్ కార్యకర్తలు పాల్గొన్నారు.