అక్షర టుడే, వెబ్‌డెస్క్: Minister Seethakka | సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆచారాలు దెబ్బ తినకుండా మేడారంలోని అమ్మవార్ల గద్దెలను సుందరంగా తీర్చిదిద్దుతామని పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. యుద్ధ ప్రాతిపదిక పై గుడి నిర్మాణ ఏర్పాట్లు చేసి భక్తులకు అందుబాటులో తేస్తామని చెప్పారు.
గిరిజనుల ఆచారాలు, సాంప్రదాయాలు, పూజారుల అభిప్రాయం మేరకే నూతన గుడి నిర్మాణ ఏర్పాట్లు జరుగుతాయని స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణంపై సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని సమ్మక్క సారలమ్మ దేవాలయం (Sammakka Saralamma temple) ప్రాంగణంలో గిరిజన పూజారులు, ఆర్కిటెక్టులు, దేవాదాయ అధికారులతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతరలో సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, గుడి ప్రాంగణాన్ని మార్పులు చేర్పులు చేయడంలో గత కొద్ది రోజులుగా పూజారులతో సమావేశం అవుతున్నామన్నారు.
Minister Seethakka | భక్తుల విశ్వాసం మేరకే..
సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు గోత్రాల ప్రకారం గుడి నిర్మాణ ఏర్పాట్లు జరుగుతాయని, దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం జరిగిందని సీతక్క తెలిపారు. ఎంత డబ్బు ఖర్చయినా వెయ్యి సంవత్సరాలు పాటు నిలిచిపోయేలా నిర్మాణం ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదేశించారని, గుడి గొప్పతనంతో పాటు భక్తుల విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారని చెప్పారు.
Minister Seethakka | పూజరుల అభిప్రాయాలతోనే..
చిన్న గద్దెల మార్పిడి వలన అపచారం జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని సీతక్క స్పష్టం చేశారు. ఆయా పూజారుల అభిప్రాయం మేరకే పనులు కొనసాగుతాయన్నారు. గద్దెల ప్రాంతాన్ని 20 ఫీట్ల వెడల్పుతో 80 ఫీట్ల పొడుగుతో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.. సమ్మక్క సారలమ్మ పై రేవంత్ రెడ్డికి అపారమైన నమ్మకం ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారం రావడానికి రేవంత్ రెడ్డి తన పాదయాత్రను అమ్మవారి సన్నిధి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు.
తల్లుల దీవెనల కోసం జాతరకు ముందు జాతర సమయంలో అమ్మవార్ల ఆశీస్సుల కోసం సీఎం మేడారం రానున్నారన్నారు. మేడారం (Medaram) మహా జాతర సందర్భంగా భక్తులు సులభంగా తల్లులను దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్న సీతక్క.., భక్తుల విశ్వాసం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భక్తులను ఆకట్టుకునే నూతన గుడి నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు.