అక్షర టుడే, వెబ్‌డెస్క్: Supreme Court | బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) డ్రైవ్‌లో భాగంగా చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే మొత్తం ప్రక్రియను పక్కన పెడతామని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం హెచ్చరించింది. అయితే, భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ విధుల ప్రకారమే నడుచుకుంటుందని భావిస్తున్నామని తెలిపింది.
బీహార్‌లో ఓటర్ జాబితాల (Bihar Voter Lists) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పుడే తుది నిర్ణయానికి రాలేమని, సగం సగం తీర్పు ఇవ్వలేమని తెలిపింది. అక్టోబర్ 7న తుది వాదనల తర్వాత తీర్పు వెలువరిస్తామని పేర్కొంది. తుది తీర్పు దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Supreme Court | నిబంధనల ప్రకారమే ఈసీ నిర్ణయాలు..
రాజ్యాంగ అధికారం కలిగిన పోల్ సంస్థ మొత్తం బీహార్ SIR ప్రక్రియలో చట్ట ప్రకారం, తప్పనిసరి నియమాలను పాటిస్తుందని జస్టిస్ సూర్యకాంత్, జోయ్మల్య బాగ్చిలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. బీహార్ SIRలో ఆధార్ కార్డును 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలని ఎన్నికల కమిషన్‌ను (Election Commission) ఆదేశిస్తూ సెప్టెంబర్ 8న ఇచ్చిన ఉత్తర్వును సవరించడానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది. “డ్రైవింగ్ లైసెన్సులను నకిలీ చేయవచ్చు. రేషన్ కార్డులను ఫోర్జరీ చేయవచ్చు. అనేక పత్రాలను నకిలీ చేయవచ్చు. చట్టం అనుమతించిన మేరకు ఆధార్‌ను ఉపయోగించుకోవాలి” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని బార్ అండ్ బెంచ్ నివేదించింది. దీనిపై అక్టోబర్ 7న పరిశీలిస్తామని, ఈలోగా ప్రతి ఒక్కరూ తమ వాదనలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
Supreme Court | ఆధార్‌ను పరిగణించాలన్న కోర్టు..
బీహార్ SIR డ్రైవ్‌లో (Bihar SIR drive) ఓటర్ల గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డును చేర్చాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 8న ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటర్ల నుంచి ఆధార్ కార్డును అంగీకరించనందుకు ఈసీ అధికారులకు (EC officials) జారీ చేసిన షోకాజ్ నోటీసులపై ఎన్నికల కమిషన్ వివరణ కోరింది. అయితే, విచారణ సందర్భంగా, ఆధార్ కార్డు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23 (4)కి అతీతం కాదు అని కోర్టు పేర్కొంది.
“బీహార్ రాష్ట్రంలో సవరించిన ఓటరు జాబితాలో చేర్చడానికి లేదా తొలగించడానికి ఆధార్ కార్డును (Aadhaar card) గుర్తింపు రుజువుగా అంగీకరించాలని భారత ఎన్నికల సంఘం, దాని అధికారులను మేము ఆదేశిస్తున్నాం. ఈ ప్రయోజనం కోసం ఆధార్ కార్డును అధికారులు 12వ పత్రంగా పరిగణిస్తారు” అని కోర్టు తెలిపింది. “అయితే, మరిన్ని రుజువులు/పత్రాలను కోరడం ద్వారా, ఇతర లెక్కించబడిన పత్రాల మాదిరిగానే ఆధార్ కార్డు ప్రామాణికత మరియు వాస్తవికతను ధృవీకరించే హక్కు అధికారులకు ఉంటుందని” కోర్టు స్పష్టం చేసింది.