అక్షరటుడే, ఇందూరు: Special Intensive Revision | రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు సన్నద్ధమై ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) సుదర్శన్ రెడ్డి సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు ఈఆర్వోలతో (EERO) సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బీహార్ (Bihar) రాష్ట్ర సాధారణ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రక్రియ పూర్తయిందని గుర్తుచేశారు. తెలంగాణలో ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు. 2002 ఓటర్ జాబితాతో 2025 జాబితాను సరిపోల్చుకోవాలని సూచించారు.
ఎస్ఐఆర్ (SIR)నిర్వహణపై సూపర్వైజర్లు, బీఎల్వోలకు శిక్షణ అందించాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, కిరణ్మయి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.