అక్షరటుడే, ఇందూరు: Anganwadi Centers | అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన భవన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం మహిళా, శిశు సంక్షేమ శాఖ (Women Child Welfare Department) పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంకా భవన నిర్మాణాల కోసం అవసరమైన స్థలసేకరణ కోసం మండల తహశీల్దార్లను సంప్రదించి ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అన్ని కేంద్రాల్లోని అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ తదితర వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
కొత్తగా చేపట్టాల్సిన నిర్మాణాలు, సదుపాయాల కల్పన మరమ్మతు పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. పోషణ్ అభియాన్ (Poshan Abhiyan) సమర్థవంతంగా అమలు చేస్తూ చిన్నారులు, గర్భిణులు బాలింతల ఆరోగ్యాల పరిరక్షణకు పాటుపడాలన్నారు.
అనంతరం జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ మాట్లాడుతూ.. జిల్లాలో 1,501 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇందులో 494 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయని, 610 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. మరో 397 కేంద్రాలు అద్దె చెల్లించే అవసరం లేకుండా వివిధ భవనాల్లో నడుస్తున్నాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, పంచాయతీ అధికారి శంకర్, సీడీపీవోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.