అక్షర టుడే, వెబ్‌డెస్క్: PM Modi | రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం బీహార్ రాష్ట్రంలో పర్యటించిన ఆయన పూర్నియాలో బహుళ ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత జరిగిన నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని.. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనలో బీహార్ చాలా నష్టపోయిందన్నారు.
మహాఘట్ బంధన్ కూటమిపై (Mahaghat Bandhan alliance) నిప్పులు చెరిగారు. దేశంలోని చొరబాటుదారులందరినీ తమ ప్రభుత్వం తరిమికొడుతుందన్నారు. బీహార్ గుర్తింపును, గౌరవాన్ని కించపరుస్తున్నాయని ఆ రెండు పార్టీలను విమర్శించారు.
PM Modi | అభివృద్ధిని జీర్ణించుకోలేకే..
బీహార్ అభివృద్ధిని కాంగ్రెస్, ఆర్జేడీ జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అవి అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) బీహార్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆ ఇద్దరికీ తగిన సమాధానం ఇస్తారన్నారు. “కాంగ్రెస్, ఆర్జేడీ బీహార్ ఆత్మగౌరవాన్ని మాత్రమే కాకుండా బీహార్ గుర్తింపును కూడా దెబ్బ తీశాయి.. నేడు, సీమాంచల్, తూర్పు భారతదేశంలో చొరబాటుదారుల కారణంగా భారీ జనాభా సంక్షోభం తలెత్తింది. బీహార్, బెంగాల్, అస్సాం (Bengal and Assam) సహా అనేక రాష్ట్రాల ప్రజలు తమ సోదరీమణులు, కుమార్తెల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
PM Modi | చొరబాటుదారులను రక్షిస్తున్నారు..
కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీ (Congress and RJD parties) చొరబాటుదారులకు మద్దతుగా నిలుస్తున్నాని ప్రధాని పునరుద్ఘాటించారు. ఓటుబ్యాంకు కోసం చొరబాటుదారులను రక్షించడానికి యాత్రలు చేయడంలో బిజీగా ఉన్నాయని మండిపడ్డారు. పైగా సిగ్గు లేకుండా దేశ వ్యతిరేకులతో జత కలిసి నినాదాలు చేస్తున్నారన్నారు. “అందుకే నేను ఎర్రకోట నుంచి డెమోగ్రఫీ మిషన్ను ప్రకటించాను. కానీ ఓటు బ్యాంకు కోసం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎకో సిస్టమ్ చొరబాటుదారుల కోసం వాదించడం, వారిని రక్షించడం, సిగ్గు లేకుండా నినాదాలు చేయడం, విదేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులను రక్షించడానికి యాత్రలు చేయడంలో బిజీగా ఉన్నాయి” అని ధ్వజమెత్తారు.
PM Modi | కుటుంబ ప్రయోజనాలే లక్ష్యం
కాంగ్రెస్, ఆర్జేడీలకు తమ కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని మోదీ విమర్శించారు. కానీ తాము మాత్రం అందరి ప్రయోజనాల కోసం పాటు పడుతున్నామన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు తమ కుటుంబాల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారని, కానీ తాను ‘సబ్కా సాత్ సబ్కా విశ్వాస్’ను (Sabka Saath Sabka Vishwas) నమ్ముతానన్నారు.
జీఎస్టీ సంస్కరణలపై తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 22 నుండి దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్నును గరిష్టంగా తగ్గించనున్నట్లు చెప్పారు. ప్రజల ‘పొదుపు’ గురించి శ్రద్ధ వహిస్తున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. “ఇక్కడికి వచ్చిన నా తల్లులు, సోదరీమణులారా, GST తగ్గింపు కారణంగా వంటగది ఖర్చులు చాలా తగ్గుతాయని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. టూత్పేస్ట్, సబ్బు, షాంపూ నుంచి నెయ్యి వరకు.. అనేక ఆహార పదార్థాలు చౌకగా మారతాయి” అని తెలిపారు. తన ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు.