అక్షరటుడే, ఇందూరు : Prajavani | నిజామాబాద్ మూడో కల్లు డిపోలో (Kallu Depot) అర్హులైన కార్మికులకు అవకాశం కల్పించకుండా.. స్థానికేతరులకు సభ్యత్వం ఇచ్చారని నగరానికి చెందిన గీత కార్మికుడు సురేష్ గౌడ్ వాపోయారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) సోమవారం వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే సంఘంలో ఇతర సంఘాల్లో సభ్యులైన వారికి, టాపింగ్ టెస్టులో (Topping Test) పాల్గొనని వారికి, దుబాయ్లో ఉన్నవారికి, ఉద్యోగం చేసుకునే వారికి సభ్యత్వం ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కనీసం చెట్టు ఎక్కరాని వాళ్లకూ కూడా సభ్యత్వం ఇవ్వడమేమిటని వారు ప్రశ్నించారు.
ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు తాత్కాలికంగా ఆధార్ కార్డులో (Aadhar Card) అడ్రస్ మార్చి సభ్యత్వం తీసుకున్నారని వాపోయారు. ప్రధానంగా సేపూరు స్వామి గౌడ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. వారి సొంత గ్రామంలో సభ్యులుగా ఉన్నారని, అయినా మళ్లీ ఇక్కడ తీసుకోవడం తగదన్నారు. వినతిపత్రం అందించిన వారిలో నవీన్, భిక్షపతి, ప్రవీణ్, మధు తదితరులున్నారు.