అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hero Upendra | ప్రముఖ కన్నడ నటుడు రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక ఉపేంద్ర సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోరారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసిన హ్యాకర్లు, వారి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి వ్యక్తిగత డేటా దొంగిలించారని, ఆ వెంటనే తమ సోషల్ మీడియా ఖాతాల నుండి డబ్బులు అడిగే సందేశాలు పంపిస్తున్నారని ఉపేంద్ర (Hero Upendra) తెలిపారు.
ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్ర తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వీడియో రూపంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ఉపేంద్ర భార్య ప్రియాంకకు ఒక అపరిచిత వ్యక్తి డెలివరీ ఏజెంట్ (Delivery Agent) అని చెబుతూ ఫోన్ చేశాడు. వస్తువు డెలివరీ కోసం కొన్ని నంబర్లు, హ్యాష్ కోడ్‌లు డయల్ చేయమని సూచించాడు.
Hero Upendra | వారి వలలో చిక్కుకున్నారు..
అతని మాటలను నమ్మిన ఆమె తానే స్వయంగా ఫోన్‌ను హ్యాక్‌కి గురిచేసుకుంది. కొద్ది సేపటికే ఉపేంద్ర ఫోన్ కూడా హ్యాక్ అయినట్లు తెలిపారు. హ్యాకింగ్ (Hacking) అనంతరం వారి ఫోన్లతో పాటు సోషల్ మీడియా ఖాతాలు కూడా మోసగాళ్ల నియంత్రణలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటి నుండి తమ ఖాతాల నుంచి ఎవరైనా డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని, ఎవరూ నమ్మరాదని ఉపేంద్ర హెచ్చరించారు. మా ఫోన్ నంబర్ల నుంచి లేదా మా సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎవరైనా మీకు మెసేజ్‌లు పంపినా, డబ్బులు అడిగినా వెంటనే అప్రమత్తం అవ్వండి. అవి మా నుండి వచ్చినవిగా భావించి డబ్బులు పంపొద్దు,” అంటూ ఉపేంద్ర హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు (Cybercrime Police) ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఘటనతో సెలబ్రిటీలు సైతం ఈ రకమైన మోసాలు బారిన పడతారని అర్ధమవుతుంది. కనుక సామాన్య ప్రజలు సైతం ఓటీపీ, హ్యాష్ కోడ్‌లు, అనుమానాస్పద లింకులు వంటి వాటి విషయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాల ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సైబర్ మోసాల (Cyber Fraud) నుంచి తప్పించుకోవాలంటే ఎవరికైనా వ్యక్తిగత సమాచారం, OTPలు, కోడ్‌లు ఇవ్వకండి. ఏ సందేహాస్పద ఫోన్ వచ్చినా పోలీసులకు తెలియజేయండి.