అక్షరటుడే, ఇందూరు : Prajapalana | జిల్లాలో ఈనెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో (Collectorate) నిర్వహించనున్న ఈ వేడుకలను పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
ప్రజాపాలన (Prajapalana) దినోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని అన్నారు. ముఖ్య అతిథితో పాటు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షించాలని అన్నారు. వేదిక, సీటింగ్ ఏర్పాట్లు, తదితర వాటి గురించి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.