అక్షరటుడే, వెబ్‌డెస్క్:Ayodhya | అయోధ్య, ఫైజాబాద్‌లను కలిపే రామ్ పథ్(Rampath) మార్గంలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్లు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) తెలిపింది. రెండు నగరాల మధ్య గల 14 కిలోమీటర్ల రహదారిని రామ్పథ్గా పిలుస్తారు. ఈ మార్గంలో మద్యం, మాంసం అమ్మకాలను నిషేధించాలని స్థానిక బల్దియా తాజాగా తీర్మానించింది. అయోధ్యలో ఇప్పటికే మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం ఉంది. ఇప్పుడది ఫైజాబాద్ మార్గంలోనూ వర్తించనుంది.
Ayodhya | ప్రకటనలపైనా..
అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మాంసం, మద్యం నిషేధించడంతో పాటు కొన్ని ప్రకటనలపైనా ఆంక్షలు విధించింది. పాన్, గుట్కా, బీడీ, సిగరెట్లపైనా నిషేధం విధించింది. అలాగే, పురుషులు, మహిళల లోదుస్తుల వంటి ఉత్పత్తుల ప్రకటనలను కూడా నిషేధిస్తున్నట్లు కార్పొరేషన్ తెలిపింది. చారిత్రక నగరం ఆధ్యాత్మిక, మతపరమైన పవిత్రతను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయోధ్య మేయర్ గిరీష్ పాటి త్రిపాఠి(Ayodhya Mayor Girish Pati Tripathi) వెల్లడించారు. రామ్ పథ్‌కు రాముడి పేరు పెట్టారు కాబట్టి దాని వెంట వాణిజ్య కార్యకలాపాలు ఈ ప్రాంత పవిత్రతను ప్రతిబింబించాలని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
అయోధ్యలో చాలా సంవత్సరాలుగా మద్యం, మాంసం అమ్మకాలను అనుమతించనప్పటికీ, ఫైజాబాద్‌లో ముఖ్యంగా రామ్ పథ్(Rampath) వెంబడి ఉన్న ప్రాంతాలలో మాంసాహారం, మద్యం అమ్మే అనేక దుకాణాలు, హోటళ్లు చాలా ఉన్నాయి. వీటిలో సివిల్ లైన్స్‌లో దాదాపు 50 సంవత్సరాల పురాతనమైన రెస్టారెంట్లు ఉన్నాయి. ఇది మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. తాజా నిషేధం తర్వాత వీటిని మరోచోటికి తరలించాల్సి ఉంటుంది. అన్ని మద్యం మాంసం దుకాణాలు రామ్ పథ్ నుంచి కనీసం అర కిలోమీటరు దూరానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.