అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | రేవంత్‌రెడ్డి ధన దాహానికి పేద ప్రజలు బలవుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్(Triple R Alignment) మార్చి పేదల పొట్ట కొడతోందని మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులు సోమవారం హరీశ్‌రావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.
తమ భూములు కోల్పోకుండా, అలైన్మెంట్ లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని, పాత అలైన్మెంట్ ని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చిన హరీశ్‌రావు(Harish Rao) మాట్లాడుతూ సర్కారుపై నిప్పులు చెరిగారు.
Harish Rao | పేదల భూములు గుంజుకుంటుండ్రు
రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అలైన్‌మెంట్ మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congess Government) పేదల భూములను లాక్కుంటోందని హరీశ్‌రావు మండిపడడ్ఆరు. కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు పంట భూములను కోల్పోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. పచ్చటి పొలాల గుండా అలైన్మెంట్ చేసి, రైతన్న నోట్లో మట్టి కొడుతున్నారని, రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌తో రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆడుతున్న ఆటలు పేద రైతులకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి బీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులు భూములు కోల్పోకుండా త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను గిర్మాపూర్ చేవెళ్ల మీదుగా ప్రతిపాదించిందని తెలిపారు. కానీ, రేవంత్‌రెడ్డి తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా ట్రిపుల్ ఆర్ మార్గాన్ని అష్టవంకరలుగా తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రకు తెర లేపారని మండిపడ్డారు.
Harish Rao | రైతుల బాధ పట్టదా?
ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పులు వల్ల రైతులు(Farmers) సర్వం కోల్పోతున్నారని హరీశ్‌రావు అన్నారు. రైతులు రోడ్లపై పడే పరిస్థితి ఏర్పడినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. ఒక ఊరికి ఊరే పూర్తిగా మీ ధన దాహానికి బలైతుంటే కనీసం దయ చూపరా ? అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకుల భూములు నష్టపోకుండా రైతుల పొలాలు మాత్రమే నష్టపోయేలా ప్రతిపాదించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు ట్రిపుల్ ఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద రైతులను బలి చేస్తూ కాంగ్రెస్ నాయకుల భూములను కాపాడుతున్నదన్నారు.
ట్రిపుల్ ఆర్ పేరిట వేలాది ఎకరాలు సేకరించే క్రమంలో పెద్దల కోసం ఆలైన్‌మెంట్ మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాల పొట్టలుగొట్టే ప్రణాళికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. భువనగిరి లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ గారితో.. ట్రిపుల్ ఆర్ లో భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పించారని, కానీ, అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. వేధిస్తూ దాడులకు దిగుతున్నారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి త్రిపుల్ ఆర్ ప్రాజెక్టుపై రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.