అక్షరటుడే, కామారెడ్డి: Anganwadi Teachers | తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ (government advisor Shabbir Ali) ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల సంఘం కార్యదర్శి బాబాయమ్మ మాట్లాడుతూ.. ఏళ్లుగా అంగన్వాడీల్లో పనిచేస్తున్నామని.. ప్రభుత్వం తమను రోడ్లపై అడుక్కుతినేలా చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు (Anganwadi workers) సోమవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షబ్బీర్ అలీ రావాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి (District Library Chairman Maddi Chandrakanth) అంగన్వాడీల వద్దకు వచ్చి మాట్లాడారు. షబ్బీర్ అలీ స్థానికంగా అందుబాటులో లేరని మంగళవారం కొంతమంది తనతో వస్తే తీసుకెళ్లి మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా బాబాయమ్మ మాట్లాడుతూ.. పీఎంసీలు ప్రీప్రైమరీ స్కూల్స్‌ను (pre-primary schools) ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిసి మూడు నెలల నుంచే మంత్రి సీతక్క (Minister Seethakka), కమిషనర్, డైరెక్టర్లకు తామే వాటిని నిర్వహిస్తామని వినతిపత్రాలు అందజేశామన్నారు. అయినా కలెక్టర్లకు ఆదేశాలివ్వడంతో ఈనెల 10న ప్రీస్కూళ్లను ప్రారంభించారని తెలిపారు. దాంతో అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య తగిందన్నారు. ఫేస్ రికగ్నేషన్ ద్వారా లబ్ధిదారుల ముఖాలు సరిగా రావడం లేదని, ఆ విధానం తీసేయాలని డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన 5జీ ఫోన్లు పని చేయడం లేదని, ఫోన్లో రెండు యాప్స్ డౌన్ లోడ్ చేయడం తమవల్ల కావడం లేదని ఒకే యాప్ నిర్ణయించాలని కోరారు.
2024లో దాదాపు 10 వేల మంది టీచర్లు, ఆయాలు రిటైర్మెంట్ అయ్యారని, వారికి ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని వాపోయారు. వారికి ఆసరా పింఛన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని తెలిపారు. ఇలా ఏదీ ఇవ్వకపోతే తాము ఎలా బతకాలని.. బస్టాండ్లలో అడుక్కు తినాలా..? అని ప్రశ్నించారు. సంగారెడ్డి బస్టాండ్‌లో (Sangareddy bus stand) ఓ టీచర్, ఆయా డబ్బులు లేక అడుక్కున్న విషయాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.18వేల జీతం ఇస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికి అతీగతి లేదని వాపోయారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25న చలో సెక్రెటేరియట్ నిర్వహించనున్నట్టు చెప్పారు.