అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eagle Team | తెలంగాణలో మత్తు పదార్థాల వాడకం విచ్చలవిడిగా పెరిగి పోయింది. మాదక ద్రవ్యాల వినియోగం పెచ్చరిల్లింది. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన అక్రమార్కులు నిషేధిత గంజాయి, డ్రగ్స్ దందాకు తెర లేపారు.
యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా తయారీ, సరఫరా చేస్తున్నారు. ఏకంగా ఓ పాఠశాలలోనే మత్తు పదార్థాలు తయారీచేస్తూ పట్టుబడడం రాష్ట్రంలో కలకలం రేపింది. రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే విద్యాలయంలోనే అల్ఫ్రాజోలం(Alfrazolam) తయారు చేస్తున్న ఘటన బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓవైపు, మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా, మత్తుపదార్థాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న తరుణంలో హైదరాబాద్ బోయిన్‌పల్లిలో వెలుగు చూసిన ఘటన నివ్వెర పరిచింది. తాజా ఉదంతం అబ్కారీ శాఖ(Excise Department), నార్కోటిక్స్, ఈగల్ బృందాల పనితీరు ఎలా ఎత్తి చూపింది.
Eagle Team | ఏకంగా పాఠశాలలోనే తయారీ..
హైదరాబాద్ బోయినపల్లిలోని శ్రీమేధా స్కూల్(Srimedha School)లో డ్రగ్స్ తయారు చేస్తున్న ఘటన ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. పొద్దున పూట పాఠశాల నిర్వహిస్తుండగా, ఆ తర్వాత నుంచి అల్ఫ్రాజోలం తయారీ చేస్తున్నట్లు తేలింది. స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్‌గౌడ్ పదినెలలుగా అల్ఫ్రాజోలమ్ తయారుచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తన బైక్ మీదనే దాన్ని కస్టమర్లకు సరఫరా చేసేవాడు. అతడితో పాటు పలువురిని అరెస్టు చేసిన ఈగల్ టీమ్(Eagle Team) లోతుగా దర్యాప్తు చేస్తోంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారు.. ఎక్కడెక్కడికి సరఫరా చేశారనే దానిపై దృష్టి సారించింది. మరోవైపు, శ్రీమేధా పాఠశాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన విద్యాశాఖ ఆ పాఠశాలను సీజ్ చేసింది. దీంతో 130 మంది విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనలో పడింది.
Eagle Team | మాదక ద్రవ్యాల సరఫరా..
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల మామూళ్ల పర్వం నేపథ్యంలో మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా ముఠాలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు, యువతనే టార్గెట్‌గా చేసుకుని దందా సాగిస్తున్నాయి. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన డ్రగ్స్ నేడు చిన్న చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా చేరాయి. పబ్బులు, ఫామ్‌హౌస్‌లలోనే వినియోగించే మాదక ద్రవ్యాలు అంతటా సర్వసాధరణంగా మారాయి. చాలా ఖరీదైన కొకైన్, ఎఫిడ్రిన్ కూడా సులువుగా దొరుకుతున్నాయి. ఇక గంజాయి సరఫరాకు అడ్డే లేకుండా పోయింది. దీనికి తోడు కల్తీ కల్లు కూడా పోటెత్తుతోంది. అల్ఫ్రాజోలం, హైడ్రోక్లోరేట్(Hydrochlorate) వంటి వాటితో తయారుచేసిన కల్లు ఊరూర ఉప్పొంగుతోంది. కల్తీ కల్లు తాగి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా ఎక్సైజ్, నార్కోటిక్స్ విభాగాలు అడుగు బయటపెట్టడం లేదు.
Eagle Team | పాఠశాలలు, కళాశాలల్లో సరఫరా..
మత్తు పదార్థల విక్రయాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా విక్రయాలు సాగుతున్నాయి. ఏకంగా పాఠశాలలు, కళాశాలల్లోనే వీటిని విక్రయిస్తున్న ఘటనలు గతంలో పలుమార్లు బయటపడ్డాయి. కళాశాలలు, పాఠశాలలకు ఆనుకుని ఉన్న చిన్న చిన్న షాపుల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఉదంతాలు వెలుగు చూశాయి. విచ్చలవిడిగా దొరుకుతున్న మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న విద్యార్థులు.. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి తోడు మామూళ్లు తోడవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా యువత, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని దందా సాగిస్తున్నారు.
Eagle Team | ఫలించని ప్రభుత్వ ప్రయత్నాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి రాగానే డ్రగ్స్, గంజాయి నియంత్రణపై దృష్టి సారించింది. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు హోటళ్లు, పబ్బులపై దాడులు చేయించింది. మరోవైపు, మత్తుపదార్థాల తయారీ, సరఫరాపై అడ్డుకట్టు వేసేందుకు ఈగల్ టీమ్‌ను రంగంలోకి దించింది. అడపాదడపా డ్రగ్స్, గంజాయి ముఠాలను పట్టుకుంటున్నా పూర్తి స్థాయిలో కట్టడి చేయలేక పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా వేళ్లూనుకున్న ముఠాల ఆట కట్టించడంలో వైఫల్యం చెందుతోంద. నార్కోటిక్స్, ఎక్సైజ్ కలిసి పని చేస్తేనే మాదక ద్రవ్యాలను అడ్డుకునే అవకాశముంది. కానీ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.