అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి వైదొలగాలని దేశీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం లార్సెన్ అండ్ టర్బో కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు సంస్థ కేంద్రం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది.
మెట్రో ప్రాజెక్టు తొలి దశలో ఎదురైన భారీ ఆర్థిక నష్టాలు, అపరిమిత అప్పులు, అలాగే రెండో దశలో తలెత్తే నిర్వహణ సవాళ్లే ఈ వెనుక తగ్గుదలకు ప్రధాన కారణాలిగా ఎల్&టి పేర్కొంది. ఎల్&టి సంస్థ (L&T Company) దాదాపు రూ.19,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు తొలి దశను నిర్మించింది. మొత్తం 72 కి.మీ. పొడవుతో ఈ మెట్రో నెట్‌వర్క్ 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది.ఇది 35 ఏళ్ల రాయితీ ఒప్పందం (Concession Agreement) కింద చేపట్టిన ప్రాజెక్ట్.
Hyderabad Metro | నష్టాలలో..
అయితే, ప్రారంభం నుంచే ప్రాజెక్టు నష్టాల్లో కొనసాగుతోంది. ఎల్&టి తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు రూ.6,000 కోట్ల నష్టాలు వచ్చాయి. అంతేకాకుండా సంస్థపై రూ.13,000 కోట్ల రుణ భారం ఉండగా, వాటిపై అధిక వడ్డీ రేట్లు చెల్లించడం కష్టంగా మారిందని పేర్కొంది. మెట్రో రైలు సేవల నుంచి వచ్చే టికెట్ రెవెన్యూ, ప్రకటనల ఆదాయం, రియల్ ఎస్టేట్ (మాల్స్) ద్వారా లభించే ఆదాయం నిర్వహణ ఖర్చులు మాత్రమే కవర్ చేస్తోందని, వడ్డీలు చెల్లించడానికి సరిపోవడం లేదని ఎల్&టి వాపోయింది.అంతేకాదు, గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వాన్ని(Telangana Government)ఆర్థిక సహాయం కోసం పలుమార్లు కోరినా, సరైన మద్దతు లభించలేదని సంస్థ ఆరోపించింది.
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రెండో దశ ప్రాజెక్టును ప్రభుత్వం వేరే ఏజెన్సీ ద్వారా నిర్మించాలన్న యోచన ఎల్&టి సంస్థకు అభ్యంతరంగా ఉంది.ఈ రెండు దశల మధ్య ట్రావెల్ ఇంటిగ్రేషన్, టికెట్ వ్యవస్థ, నిర్వహణ వంటి అంశాల్లో తలెత్తే సమస్యలు, సంస్థకు మరింత ఆర్థిక భారం తెస్తాయని ఎల్&టి స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో తమకు ఉన్న 90% పైగా వాటాను కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించేందుకు సిద్ధమని ఎల్&టి ప్రకటించింది. అంతేకాదు, భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణ మొత్తం బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని సూచించింది.ఎల్&టి తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ప్రాజెక్టు మరింత సవాళ్లను ఎదుర్కొనాల్సిన అవకాశం ఉంది.దీనిపై ఎలాంటి పరిష్కార మార్గాలను ప్రభుత్వం అనుసరిస్తుందో త్వరలో స్పష్టత రావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.