అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India vs Pakistan | పాకిస్తాన్‌కు తీవ్ర పరాభవం ఎదురైంది. ఉగ్రవాదులు ఎగదోస్తున్న దాయాది దేశానికి భారత్ తగిన రీతిలో బుద్ధి చెప్పింది. ఆసియా కప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓడించడమే కాదు, ఆ దేశ ఆటగాళ్లతో కనీసం కరచాలనం చేయకుండా షాక్ ఇచ్చింది.
పాకిస్తాన్(Pakistan)తో తలపడడంపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనలకు భారత జట్టు ఈ తరహాలో మద్దతు తెలిపింది. మరోవైపు, భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీవ్ర అవమానంగా భావించింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎదుట నిరసన వ్యక్తం చేసింది.
India vs Pakistan | ఘన విజయం..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్(Asia Cup) 2025లో భాగంగా ఆదివారం జరిగిన ఆరో మ్యాచ్‌లో ఇండియా పాకిస్తాన్‌ను ఘోరంగా ఓడించింది. ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 128 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, మ్యాచ్ విజయం సాధించిన అనంతరం క్రీజులో ఉన్న శివం దుబే(Shivam Dube), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏ పాకిస్తాన్ ఆటగాడితోనూ కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి పోయారు.
India vs Pakistan | నిరసన తెలిపిన పాక్..
ఆటగాళ్లు కరచాలనం చేయక పోవడంపై పాకిస్తాన్ అవమానకరంగా ఫీల్ అయింది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ల ప్రవర్తనను క్రీడారహితమని పేర్కొంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) ఒక ప్రకటన విడుదల చేసింది. “భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం పట్ల జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రికెట్ నిబంధనలకు విరుద్ధం. దానికి నిరసనగా మేము మా కెప్టెన్‌ను మ్యాచ్ అనంతరం జరిగిన వేడుకకు పంపలేదని” తెలిపింది.
India vs Pakistan | పహల్గామ్ బాధితులకు సూర్య సంఘీభావం
తాజా వివాదంపై భారత జట్ట కెప్టెన్ సూర్యకుమార్(Captain Suryakumar) యాదవ్ స్పందించారు. తమ చర్యను ఆయన సమర్థించుకున్నారు. పహల్గామ్ దాడి బాధితులకు జట్టు మొత్తం సంఘీభావంగా నిలుస్తుందని చెప్పారు. సాయుధ దళాల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. “పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము. మేము మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. మరోవైపు, ధైర్య సాహసాలను ప్రదర్శించిన మా సాయుధ దళాలకు ఈ విజయాన్ని అంకితం చేయాలనుకుంటున్నాము. వారు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారు ”అని సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ వేడుకలో అన్నారు.
India vs Pakistan | సరైన సమాధానం ఇచ్చాం..
కరచాలన వివాదంపై సూర్యకుమార్ తన వైఖరిని స్పష్టం చేశాడు. మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేయకపోవడం గురించి భారత కెప్టెన్‌ను విలేకరుల సమావేశంలో పలువురు ప్రశ్నించారు. దీనిపై సూర్య స్పందిస్తూ.. “మా ప్రభుత్వం, BCCI ఏకాభిప్రాయంతో ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాము. మేము ఆట ఆడడానికే ఇక్కడ ఉన్నాము. మేము వారికి సరైన సమాధానం ఇచ్చామని” తెలిపారు.