అక్షరటుడే, కమ్మర్‌పల్లి: Guest lecturers | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (government junior colleges) పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అన్ని కళాశాలల్లో కలిపి దాదాపు 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తుండగా, వీరిలో 398 పోస్టులకు మాత్రమే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చింది. దీంతో మిగిలిన అధ్యాపకులు (lecturers) తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
Guest lecturers | వివరాల్లోకి వెళ్తే..
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పదేళ్లుగా అతిథి అధ్యాపకులు అరకొర వేతనాలతో పనిచేస్తున్నారు. అయితే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్రలో భాగంగా అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అంతేగాక, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనూ (Congress party manifesto) అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా.. గెస్ట్ లెక్చరర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు వాపోతున్నారు.
దీనికితోడు 1,654 పోస్టులకు గాను.. కేవలం 398 పోస్టులకి ఫైనాన్స్ అప్రూవల్ (finance approval) ఇవ్వడంతో, మరింత ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఏర్పడిన 18 కళాశాలల్లో ఆర్జేడీ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల డీఐఈవోలు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ (Finance Department) నుంచి వీరికి అప్రూవల్ రాలేదు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా ప్రభుత్వం కరుణించడం లేదని అధ్యాపకులు పేర్కొంటున్నారు.
మంత్రులు శ్రీధర్ బాబు (Ministers Sridhar Babu), వివేక్ వెంకటస్వామిని కలిసి న్యాయం చేయాలని వేడుకున్నా.. ఎలాంటి ఫలితం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలతో పాటు, 1,654 మందిని విధుల్లోకి తీసుకుని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.