అక్షరటుడే, వెబ్డెస్క్ : JC Prabhakar Reddy | తాడిపత్రిలో పరస్పర ఆరోపణల పర్వం మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Pedda Reddy)కి అందిస్తున్న పోలీసు భద్రతపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ భద్రతకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందంటూ, అది ప్రజాధనానికి నష్టం కలిగించడమేనని మండిపడ్డారు. తాడిపత్రి పట్టణ పోలీసులకు లేఖ రాసిన జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy), “పెద్దారెడ్డికి ముఖ్యమంత్రి స్థాయి భద్రతను ఉచితంగా కల్పించడం ఏంటి?… ఆయనకు భద్రత కావాలంటే, నిబంధనల ప్రకారం రుసుము చెల్లించాలి. లేకపోతే భద్రతను వెంటనే ఉపసంహరించాలి” అంటూ డిమాండ్ చేశారు.
JC Prabhakar Reddy | చెల్లించకపోతే కోర్టుకు వెళ్తా..
పెద్దారెడ్డి నుంచి భద్రతకు సంబంధించి ఎటువంటి చెల్లింపులు వసూలు చేయలేదని ఆరోపించిన జేసీ, దీనిపై స్పందించకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.ఆయన మాజీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు. కానీ ప్రస్తుత నియమ నిబంధనలను అతిక్రమిస్తూ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం సహించదగినది కాదు” అని లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు, ఈ చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ న్యాయవాది అనీఫ్ భాష సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం ఈ వివాదంలో మరో కీలుపుగా మారింది.
ఇదిలా ఉండగా, గతంలో తాడిపత్రి(Tadipatri)లో పరిస్థితుల దృష్ట్యా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భద్రత అవసరమని కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులను కోరారు. అప్పట్లో పోలీసులు, భద్రతకు అయ్యే ఖర్చును ముందుగా డిపాజిట్ చేయాలని సూచించగా, పెద్దారెడ్డి అంగీకరించారని, కానీ ఆ డిపాజిట్ నిజంగా జరిగిందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ భద్రత వ్యవహారంపై ఇప్పటికైనా పోలీసులు, ప్రభుత్వ అధికారులు స్పష్టత ఇవ్వకపోతే, రాజకీయ దుష్ప్రచారంగా మారే అవకాశం ఉంది. RTI ద్వారా వచ్చే వివరాలపై ఆధారపడి జేసీ ప్రభాకర్ రెడ్డి తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.