అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fee reimbursement | రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల బంద్‌పై ఉత్కంఠ నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని యాజమాన్యాలు (Management) తెలిపిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కొన్నాళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ (Scholarship) బకాయిలు మంజూరు కావడం లేదు. ముఖ్యంగా రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో కాలేజీల నిర్వాహణ భారంగా మారింది. దీంతో బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే సోమవారం నుంచి కాలేజీలను బంద్ చేస్తామని వారు ప్రకటించారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి (Council of Higher Education) ఛైర్మన్‌ను కలిసి నోటీసులు కూడా అందజేశారు.
Fee reimbursement | చర్చలు సఫలమయ్యేనా..
కాలేజీల యాజమాన్యాలు నోటీస్ ఇవ్వడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు యాజమాన్యాలో చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల ఫెడరేషన్ నేతలతో భేటీ కానున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్‌పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Fee reimbursement | భారీగా బకాయిలు
ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం నుంచి భారీగా బకాయిలు రావాల్సి ఉంది. సుమారు రూ.10 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు రావాలని యాజమాన్యాలు చెబుతున్నాయి. నిధులు లేకపోవడంతో కాలేజీల నిర్వాహణ భారంగా మారిందని, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని పలు కాలేజీల యజమానులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మొత్తం బకాయిలు విడుదల చేస్తుందా.. ప్రస్తుతానికి కొన్ని నిధులు విడుదల చేసి యాజమాన్యాలను బుజ్జగిస్తుందా చూడాలి.