అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే అపరిశుభ్రం చేస్తోందని తల్లిని తీసుకెళ్లి నదిలో తోసేసి హత్య చేశాడు ఓ కొడుకు. చివరకు కటకటాలపాలయ్యాడు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మీడియాకు వెల్లడించారు. ఈనెల 11న మధ్యాహ్నం బొల్లక్ పల్లి గ్రామ శివారులోని మంజీర నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. గ్రామపంచాయతీ కార్యదర్శి గంగుల శివాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిట్లం పోలీస్ స్టేషన్(Pitlam Police Station) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా గుర్తు తెలియని మహిళ మృతదేహం ఫొటోలను సీసీ కెమెరా ఫుటేజీలు సేకరించి, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో షేర్ చేసి సమాచారాన్ని అందరికీ చేరేలా చేశారు. 12న ఉదయం బోర్లం గ్రామ పెద్దలు ఒక వ్యక్తిని (మైనర్) నువ్వు, ఎర్రోళ్ల బాలయ్య ఇద్దరు కలిసి సాయవ్వను ఆస్పత్రికి తీసుకెళ్లారు కదా ఏమైందని అడగడంతో బాలుడు విషయం చెప్పడంతో సాయవ్వ హత్య విషయం బయటకు తెలిసింది.
మృతురాలు సాయవ్వ కుమారుడు ఎర్రోళ్ల బాలయ్య తన తల్లి ఆరోగ్యం బాగాలేదని, ఇంట్లో అపరిశుభ్రం చేస్తోందనే కోపంతో ఈనెల 8న రాత్రి సమయంలో తన బైక్‌పై బొల్లక్పల్లి బ్రిడ్జి(Bollakpally Bridge) వద్దకు తీసుకెళ్లి, బ్రిడ్జి మీద నుండి మంజీర నదిలోకి (Manjira River) తోసివేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట చౌరస్తా వద్ద ఆదివారం నిందితులు ఎర్రోళ్ల బాలయ్యతో పాటు బాలుడు బోర్లం నుండి కొయ్యగుట్టకు వస్తుండగా అరెస్టు చేశారు. హత్య కోసం ఉపయోగించిన బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని బాలయ్యను రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్ అబ్జర్వేషన్ హోంకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.