అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Lok Adalat | జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా నాల్గో స్థానంలో నిలిచిందని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగా లోక్ అదాలత్లో 7,444 కేసులను పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు.
లోక్ అదాలత్ను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273లను తిరిగి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. అలాగే 501 ఐపీసీ బీఎన్ఎస్ కేసులు, 138 సైబర్ క్రైం కేసులు, 1958 ఈ పెట్టి కేసులు, 4,985 ఎంవీ యాక్ట్ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
Lok Adalat | క్షణికావేశంలో తప్పులకు లోక్ అదాలత్ చక్కని పరిష్కారం
క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది చక్కని పరిష్కారమని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చన్నారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశంతో TSCSB (తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో) (Telangana State Cyber Security Bureau) డైరెక్టర్ శిఖాగోయల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో 7 కమిషనరేట్ పరిధిల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశారన్నారు.
ప్రతి జిల్లాలో D4Cని ఏర్పాటు చేసి డీఎస్పీ స్థాయి అధికారులచే పర్యవేక్షిస్తున్నామన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాల్లో జాతీయ మెగా లోక్-అదాలత్లో 138 సైబర్ క్రైమ్ కేసులలో రూ.42,45,273 తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు కృషి చేశామన్నారు.
జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురైనట్లయితే 1930కి కాల్ చేసి గాని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్ రావ్, సీఐ ముఖిద్ పాషా , సీసీఆర్ బీసీఐ సతీష్ , కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.