అక్షరటుడే, వెబ్‌డెస్క్: Traffic Challans | దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల (traffic challans) విలువ తెలుసుకుంటే ఎవరికైనా షాకే తగులుతుంది. ఇది ప్రభుత్వ అప్పు కాదు. ప్రజలు చెల్లించాల్సినది .అయితే ప్రజలు చెల్లించకుండా పెండింగ్‌లో చలాన్ల మొత్తం రూ. 97,921 కోట్లు. ఈ లెక్క 2023 వరకూ మాత్రమే.
అంటే 2024లో పెరిగిన పెండింగ్ చలాన్లను కలుపుకుంటే ఆ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు అంచనా వేస్తున్న ప్రకారం ప్రస్తుతం దేశంలో పెండింగ్ చలాన్ల (Pending Challans) విలువ లక్ష కోట్ల రూపాయలను దాటి ఉండవచ్చు.ఇంకొంతమంది వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీటిని అడ్డుకునేందుకు పోలీసులు అధిక మొత్తంలో ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారు. అయితే ప్రజలు వాటిని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల చలాన్లు పెండింగ్‌లోనే ఉంటున్నాయి.
Traffic Challans | ఇంత పెండింగ్ ఉన్నాయా..
జాతీయ స్థాయిలో ఈ మధ్య కాలంలో కేవలం 40 శాతం చలాన్లు మాత్రమే క్లియర్ అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే 14% కే పరిమితమవుతోంది. రాష్ట్రాల వారీగా చూస్తే, రాజస్థాన్ 76 శాతం చలాన్లను వసూలు చేయడంలో ముందుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు సుమారు 69 శాతం వసూలు చేసి రెండో స్థానంలో ఉన్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీ (Delhi) పరిస్థితి దారుణంగా ఉంది. 2025లో ఢిల్లీలో జారీ చేసిన రూ. 4,468 కోట్ల విలువైన చలాన్లలో కేవలం రూ. 645 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
దీంతో ఢిల్లీలో చలాన్ల వసూళ్ల కోసం లోక్ అదాలత్ (Lok Adalat) కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 2025 ఆగస్టు 31 నాటికి 48,78,292 చలాన్లు జారీ అయ్యాయి. వీటి విలువ రూ. 240.32 కోట్లు. అయితే వాటిలో 31 లక్షల 9 వేల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ చలాన్ల విలువ రూ. 60 కోట్లు దాటినట్టు అధికార లెక్కలు చెబుతున్నాయి.
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో (Hyderabad City) ఈ ఏడాది మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 లక్షల చలాన్లు జారీ అయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం చలాన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ప్రభుత్వం అమలు చేసిన డిస్కౌంట్ స్కీమ్ కారణంగా కోటి 67 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. దీనివల్ల ప్రభుత్వానికి రూ. 150.58 కోట్ల ఆదాయం లభించింది. చలాన్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు వేర్వేరు విధానాలు పాటిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కేంద్ర చట్టాలను అనుసరిస్తుండగా, తెలంగాణ (Telangana) మాత్రం సొంత రూల్స్‌తో చలాన్లు వేస్తోంది. ఉదాహరణకు, హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే ఏపీలో రూ. 1,000 ఫైన్ విధిస్తారు. అదే తెలంగాణలో మాత్రం రూ. 200 చలానా వేస్తారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో మాట్లాడితే ఏపీలో రూ. 5,000 ఫైన్ పడుతుంటే, తెలంగాణలో రూ. 1,000 చలానా మాత్రమే ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు రెండు రాష్ట్రాల్లోనూ సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అయినప్పటికీ చలాన్ల వసూళ్లలో పెరుగుతున్న పెండింగ్ లెక్కలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.