More
    HomeతెలంగాణKrishna waters | 904 టీఎంసీల కృష్ణా జలాల వాటా రావాల్సిందే : సీఎం రేవంత్​

    Krishna waters | 904 టీఎంసీల కృష్ణా జలాల వాటా రావాల్సిందే : సీఎం రేవంత్​

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Krishna waters  కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని న్యాయ నిపుణులను, ఇరిగేషన్​ ఇంజనీరింగ్​ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు.

    కృష్ణా నదిలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే.. తెలంగాణాకు చెందాల్సిన నీటివాటాలో ఒక చుక్క నీరు కుడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలన్నారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని అధికారులను ఆదేశించారు.

    ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ Telangana తుది వాదనలు వినిపించాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఢిల్లీకి వెళ్లి స్వయంగా ఈ విచారణలో పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు.

    కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్​ Krishna Water Dispute Tribunal ఎదుట తెలంగాణా ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపై ఇంటిగ్రేటేడ్​ కమాండ్ కంట్రోల్ సెంటర్​ (ICCC) లో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

    Krishna waters : ప్రతి నీటి బొట్టు రక్షించుకుందాం..

    ఇంతకాలం కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేసి, మనకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఈ సందర్భంగా న్యాయ నిపుణులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ ట్రిబ్యునల్ కు సమర్పించాలన్నారు.

    ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్​ ముందు ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు.

    ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్లు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్​కు అందించాలని సూచించారు.

    గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు కట్టబెట్టి, 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

    గత ప్రభుత్వం 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొన్న విషయాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్​ ముందుకు తెచ్చిందని న్యాయ నిపుణులు సీఎం కు వివరించారు.

    ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవటంతో ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు.

    కృష్ణా నదిపై తలపెట్టిన పాలమూరు – రంగారెడ్డి నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్​లో పెట్టిందన్నారు. నీటి వాటాల విషయంలో తీరని అన్యాయం చేసిందన్నారు.

    దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

    గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహరించటంతో ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందని, ఆ విషయాన్ని ట్రిబ్యునల్​ ముందుకు తీసుకురావాలని సీఎం చెప్పారు.

    శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్​ స్కీమ్​ Rayalaseema Lift Irrigation Scheme ద్వారా రోజుకు పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తుందని, ఇతర బేసిన్లకు తరలించుకుపోతోందని అన్నారు.

    ఎక్కడపడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవటంతో పాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్​కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

    కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించటంతో శ్రీశైలం Srisailam, నాగార్జునసాగర్ Nagarjunasagar తో పాటు పులిచింతల Pulichintala వద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టులు మూత పడే ప్రమాదం ముంచుకు వచ్చిందన్నారు.

    తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే జల విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలుగుతోందన్నారు. ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్​ ఎదుట వాదనలుగా వినిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

    కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. సాగునీటి, తాగునీటి అవసరాలతో పాటు మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్​నగర్​, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు.

    ఇప్పటి వరకు తెలంగాణా ప్రాంతంలో తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయక పోవడం వల్లనే కృష్ణా జలాశయాలను తెలంగాణా వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలన్నారు.

    తెలంగాణ తరఫున వాదనలను వినిపించేందుకు ఇదే సరైన అవకాశమని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంతో పాటు, కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటాల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే వాదనలు కావటంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని ముఖ్యమంత్రి న్యాయ నిపుణులకు సూచించారు.

    ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్ (CS Vaidyanathan), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) మాజీ ఛైర్మన్ కుష్వీందర్ వోహ్రా (Kushvinder Vohra), నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ (Aditya Nath Das), నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...