అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆక్రమణలకు పాల్పడిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కుల సంరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హైడ్రా అధికారులు ఇప్పటి వరకు రూ.వేల కోట్ల విలువైన భూములను కబ్జానుంచి కాపాడారు. తాజాగా రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంషాబాద్ మండలంలో రూ.500 కోట్ల రూపాయల విలువైన 12 ఎకరాల భూమిని శనివారం స్వాధీనం చేసుకుంది.
Hydraa | స్థానికులు ఫొటోలు పంపడంతో..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ (Shamshabad) మండలం శాతంరాయ్ గ్రామంలోని సర్వే నంబర్ 17లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఈ భూమిని ప్రభుత్తం 2011 లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (Inter Board)కు కేటాయించింది. అయితే ఈ భూమి తమదంటూ స్థానిక నాయకుడితో పాటు, అనీష్ కన్స్ట్రక్షన్ (Anish Construction) అనే సంస్థ వాదిస్తున్నాయి. ఈ మేరకు అక్కడ అనీష్ కన్స్ట్రక్షన్ సంస్థ బోర్డులు కూడా పెట్టింది. కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నించడంతో స్థానికులు హైడ్రాకు ఫొటోలను పంపించారు.
Hydraa | వేరే రికార్డులను చూపించి..
ఈ భూమిలో వ్యవసాయం చేస్తున్నామంటూ.. అసఫ్ జాహీ పైగా కుటుంబ వారసుల నుంచి కొన్నామంటూ కబ్జాదారులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది (Hydraa Staff) క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. శంషాబాద్ పరిధిలో పైగా కుటుంబాలకు చెందిన భూములు లేవని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. వేరే చోట ఉన్న ఆ భూముల రికార్డులను ఇక్కడ చూపించి కబ్జాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
సదరు సంస్థకు చెందిన శ్రీపాద దేశ్ పాండే పలు భూ వివాదాల్లో ఉన్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా అధికారులు శాతంరాయ్ గ్రామంలో ఉన్న 12 ఎకరాలు ప్రభుత్వ భూమిగా నిర్ధారించింది. అనంతరం ఆక్రమణలను తొలగించింది. ఈ భూమిలో ఎకరం పరిధిలో ఉన్న కొన్ని నివాసాలు, ఒక దేవాలయం, మసీదును కాపాడుతూనే మిగతా భూమికి కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.