అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PCC Chief | పార్టీ ఫిరాయింపుల గురించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ ఫిరాయించినట్లా? అని ప్రశ్నించారు.
కేటీఆర్, హరీశ్‌రావు(Harish Rao) గతంలో మోదీని కలిశారని, వాళ్లు బీజేపీలో చేరినట్లు తాము కూడావాళ్లకు నోటీసులో పంపిస్తామన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడిన మహేశ్ గౌడ్ అవినీతి కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని తెలిసే ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుని కాపాడాలని కోరుతున్నారని ఆరోపించారు.
PCC Chief | సీఎంను కలువడం కామన్
ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమంత్రిని కలువడం సాధారణమేనని పీసీసీ చీఫ్ అన్నారు. అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కలుస్తారని, అంత మాత్రాన పార్టీలో చేరినట్లా? అని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ నాయకులు గతంలో బీజేపీ నేతలను కలువలేదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ స్థాయిని మించి రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసింది గాంధీ కుటుంబం అయితే, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంది కేసీఆర్(KCR) కుటుంబమని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడుతారని ప్రశ్నించారు. కేటీఆర్ ,హరీష్ రావు మోదీ దగ్గర మొకరిల్లడానికి మళ్ళీ ప్రధానిని కలువాలని చూస్తున్నది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.
PCC Chief | కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు..
కేటీఆర్(KTR) రాహుల్ గాంధీ మీద విమర్శలు చేయడం ఆపి, తన చెల్లెలు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహేశ్ గౌడ్ సూచించారు. కేటీఆర్, హరీశ్ రావు బీఆర్ ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తానంటే వద్దన్నానని కవిత చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిందని స్పష్టం చేశారు. కేటీఆర్ ఇక మీ రాజకీయ శకం ముగిసిందన్న మహేశ్ గౌడ్… మోదీ(PM Modi) మోక్షం కోసం కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్షిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పదేండ్లు పాలించి వందేండ్లకు సరిపడా దోచుకున్నారని విమర్శించారు. సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవాలని మోదీ కాళ్లు మొక్కి బయటపడాలని చూస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ దేశ భవిష్యత్తును, రాజ్యాంగాన్ని కాపాడాలని కృషి చేస్తున్నరని, మోదీ ఓట్ చోరీ చేసి మూడో సారి అధికారంలోకి ఎలా వచ్చారో.. ఆధారాలతో సహా బయటపెట్టారన్నారు.
PCC Chief | స్పీకర్ దే నిర్ణయం..
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాహుల్ గాంధీని సమాధానం చెప్పాలనడం ఏమిటని ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులకు పాల్పడలేదా? అని నిలదీశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహరం. స్పీకర్ పరిధిలోనిదని, సభాపతి తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని స్పీకర్ ప్రామాణికంగా తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ అని చెప్పుకునే బీఆర్ ఎస్ పార్టీ(BRS Party) సిగ్గులేదని.. తెలంగాణ వాది అయిన సుదర్శన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదన్నారు. సీబీఐ, ఈడీల మీద నమ్మకం లేదని రాహుల్ గాంధీ చెప్పారని, తమ అభిప్రాయం కూడా అదేనన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పజెప్పితే 48 గంటల్లో తెలుస్తామన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.