అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Aishwarya Rai | ఐశ్వర్య రాయ్ … అందం, అభినయంతో ఎంతో మందిని మంత్ర ముగ్ధులని చేసిన విషయం తెలిసందే. 1994లో విశ్వసుందరిగా నిలిచిన ఈ భామ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది.
‘దేవదాస్’, ‘జోధా అక్బర్’, ‘గురు’, ‘తాళ్’ వంటి క్లాసిక్ చిత్రాల్లో తన అసాధారణ అభినయాన్ని చూపించిన ఐశ్వర్య, ఇప్పుడు ఇంటర్నెట్‌లో తనకి సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోల వల్ల తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ను డీప్ ఫేక్ టెక్నాలజీ(Fake Technology) ఉపయోగించి అసభ్యంగా మార్చి సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో వైరల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Aishwarya Rai | పిటిషన్ పై హైకోర్టు తీర్పు
అనుమానాస్పద వెబ్‌సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వీటిని ప్రాచుర్యంలోకి తెస్తున్నాయని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ అంశంపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు(Delhi High Court), సంబంధిత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్(Digital Platforms)లకు తాత్కాలిక నిషేధం విధించింది. 72 గంటలలోగా అనధికార డీప్‌ఫేక్ కంటెంట్‌ను తీసివేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ప్రత్యేకంగా AI ఆధారిత డీప్‌ఫేక్ కంటెంట్ పై వర్తిస్తాయని, అలాంటి చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు జారీ చేసిన ఈ తాత్కాలిక ఉత్తర్వులు 2026 జనవరి 15 వరకు అమలులో ఉంటాయని తెలియజేసింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలిచ్చింది.
అంతేకాదు, బాధితుల గౌరవాన్ని కాపాడేందుకు డీప్‌ఫేక్(Deep Fake)లపై కేంద్ర ప్రభుత్వం మరియు పోలీసు విభాగాలు మరింత శక్తివంతంగా వ్యవహరించాలన్న సూచనలూ చేసింది. ఐశ్వర్య రాయ్ ఈ న్యాయపోరాటం ద్వారా మరోసారి సమాజం పట్ల తనకున్న బాధ్యతను గుర్తు చేశారు. డీప్‌ఫేక్ వంటి హానికరమైన టెక్నాలజీని ఎదుర్కొనడంలో మహిళలు మౌనంగా ఉండకూడదు. ఆమె తీసుకున్న నిర్ణయం, ఎందరో బాధితులకు మార్గదర్శకంగా నిలవనున్నాయి.