అక్షరటుడే, కామారెడ్డి: GGH Kamareddy | పట్టణంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో మృతశిశువు జన్మించడం కలకలం రేపింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు వాగ్వాదానికి దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. తాడ్వాయి(Tadwai) మండలం బ్రహ్మాజీవాడి(Brahmajiwadi) గ్రామానికి చెందిన అఖిలకు శుక్రవారం అర్ధరాత్రి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను జీజీహెచ్‌కు తీసుకొచ్చారు.
మొదటి కాన్పు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నొప్పులు భరించలేకపోతుందని ఆపరేషన్ చేయాలని తాము వేడుకున్నామని.. అయినప్పటికీ మొదటి కాన్పు కావడంతో వైద్యులు సాధారణ ప్రసవం చేయడానికి ప్రయత్నించారని వారు ఆరోపిస్తున్నారు. తాము ఎంత వేడుకున్నా సాధారణ ప్రసవం వైపే వైద్యులు మొగ్గుచూపి కాన్పు చేశారని వారు పేర్కొన్నారు.
ఆడపిల్ల పుట్టడంతో మహాలక్ష్మి పుట్టిందని సంబరపడేలోపు పుట్టిన శిశువులో చలనం లేదని వారు రోదిస్తూ పేర్కొన్నారు. మృత శిశువు జన్మించిందని వైద్యులు చెప్పడంతో అర్ధరాత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. తాము చెప్పినట్లు ఆపరేషన్ చేస్తే బిడ్డ బతికేదని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ కడుపులోనే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా ప్రసవం సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు. ఉమ్మనీరు మింగడంతోనే శిశువు మృతి చెందిందని స్పష్టం చేశారు.