అక్షరటుడే, ఇందూరు: MP Arvind | నిజామాబాద్ నుంచి వందే భారత్ రైలు నడిచేలా తన వంతు కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ (Chamber of Commerce) నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమస్యలపై వినతి పత్రం అందించిందని వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఇప్పటికే పలు రైళ్లు జిల్లా నుంచి ముంబైకి, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ వ్యాపారస్తులకు ఊరట కల్పించిందన్నారు. ఇకపై వ్యాపారం జోరుగా సాగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని అభినందించారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
జిల్లాలో 30 ఏళ్లుగా సేవలందిస్తున్న కమిటీకి సారథ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన హయాంలో నూతన భవనం నిర్మిస్తామన్నారు. నూతన కమిటీతో రాష్ట్ర ప్రతినిధి రాచకొండ రవికుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో నూడా ఛైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు, హరి ప్రసాద్, జితేంద్ర మలాని తదితరులు పాల్గొన్నారు.