అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump tariffs | అమెరికా సుంకాలపై భారత్ వ్యూహాత్మక మౌనం పాటిస్తుండడాన్ని అమెరికా దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ (Former US National Security Advisor John Bolton) ప్రశంసించారు. అమెరికా విధించిన 50 శాతం సుంకాలను తప్పుబట్టిన ఆయన.. ఇది సరైన నిర్ణయం కాదని విమర్శించారు.
ఇలాంటి చర్యలు ఇండియా, అమెరికా (India-America) మధ్య సంబంధాలను దెబ్బ తీస్తాయని హెచ్చరించారు. అధ్యక్షుడి క్రూర ప్రవర్తనకు సుంకాలే పెద్ద ఉదాహరణ అని మండిపడ్డారు. అదే సమయంలో సుంకాలపై భారత్ మౌనంగా ఉండడం అత్యంత ఉత్తమమైన మార్గమని తెలిపారు. బహిరంగ ఘర్షణలు సమస్యలను పరిష్కరించలేవన్నారు. “ట్రంప్ లాంటి వ్యక్తితో వ్యవహరించడానికి సంయమనం వహించడమే ఉత్తమ మార్గం అని నేను భావిస్తున్నాను. మీరు అతనితో బహిరంగంగా తలపడడం సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయదు” అని బోల్టన్ అన్నారు.
Trump tariffs | దీర్ఘకాల సంబంధాలు అవసరం..
ట్రంప్ పదవికి ఇంకా మూడేళ్లు మాత్రమే మిగిలి ఉందన్న బోల్టన్.. భారతదేశం అమెరికాతో దీర్ఘకాలిక సంబంధాలపై దృష్టి పెట్టాలని నొక్కి చెప్పారు. గత నెలలో, ట్రంప్ పరిపాలన భారత వస్తువులపై 25% పరస్పర సుంకాలను విధించింది, దానితో పాటు మాస్కోతో న్యూఢిల్లీ ఇంధన వాణిజ్యానికి (New Delhi energy trade) సంబంధించిన అదనంగా 25% సుంకాన్ని విధించింది. అయితే, రష్యా నుంచి చమురు కొంటున్న భారత్‌పై మాత్రమే సుంకాలు విధించి మిగతా దేశాలను వదిలి వేయడాన్ని బోల్టన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అమెరియా, ఈయూ, చైనా సహా చాలా దేశాలు రష్యాతో (Russia) వాణిజ్యం కొనసాగిస్తున్నాయని తెలిపారు. ట్రంప్ ఒక్కోదేశంతో ఒక్కోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించడానికి మరో కారణముందని మాజీ సలహాదారు తెలిపారు. భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని (India-Pakistan War) ఆపారన్న క్రెడిట్ ఇవ్వకపోవడం కూడా ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించిందన్నారు.