అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు (Police) అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది మోసపోతూనే ఉన్నారు.
డిజిటల్ అరెస్ట్ (digital arrest) పేరిట ఇటీవల సైబర్ నేరగాళ్లు పలువురిని మోసం చేస్తున్నారు. అరెస్ట్ చేస్తామని భయపెట్టి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. మీపై కేసులు నమోదు అయ్యాయని, తాము చెప్పినట్లు చేయకపోతే అరెస్ట్ చేస్తామని భయపెడుతున్నారు. వారి మాటలు నమ్మిన అమాయకులు నిజమైన పోలీసులు అనుకొని డబ్బులు బదిలీ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కేరళలో (Kerala) చోటు చేసుకుంది.
Cyber Fraud | వాట్సాప్ కాల్ చేసి..
కేరళలోని కొల్లాంలో 79 ఏళ్ల వృద్ధుడికి జులై 7న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. వాట్సప్‌లో వీడియో కాల్ చేసి తాను బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిని అంటూ నిందితుడు పరిచయం చేసుకున్నారు. సదరు వృద్ధుడి ఫోన్ నంబర్‌ను అక్రమ కార్యకలాపాలకు వినియోగించారని, ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు (Mumbai Cyber Crime Police) ట్రాక్ చేస్తున్నారని చెప్పారు. అనంతరం మరో వ్యక్తి పోలీసు దుస్తుల్లో సదరు వృద్ధుడికి ఫోన్ చేశాడు. ముంబై సైబర్ పోలీసులమని చెప్పి నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించాడు. డిజిటల్ అరెస్ట్ చేశామని వృద్ధుడిని బెదిరించాడు.
Cyber Fraud | నకిలీ కోర్టుతో..
వృద్ధుడిని అరెస్ట్ చేశామని సైబర్ నేరగాళ్లు చెప్పారు. అంతేగాకుండా వర్చువల్‌గా నకిలీ కోర్టులో ప్రవేశ పెట్టి బెయిల్ సైతం వారే ఇచ్చారు. అనంతరం ఆయన ఖాతాలోని నగదును తాము చెప్పిన అకౌంట్లలోకి బదిలీ చేయాలని ఆదేశించారు. లేదంటే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో సదరు వృద్ధుడు జులై 23 నుంచి ఆగస్టు 29 వరకు విడతల వారు చెప్పిన ఖాతాల్లో రూ.3.72 కోట్లను ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే వారు డబ్బు తిరిగి పంపకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Cyber Fraud | అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు ఊరికే ఎవరూ గిఫ్ట్‌లు ఇవ్వరని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్ చేసి తాము పోలీసులం, సీబీఐ అధికారులమని(CBI Officers) చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. అలాంటి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవద్దన్నారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి సమాచారం అందించాలని సూచించారు.