అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను ఆపేందుకు యత్నిస్తున్న అమెరికా భారత్‌పై మరింత ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిన అగ్రరాజ్యం(America).. ఇప్పుడు మిత్ర దేశాలను పురమాయిస్తోంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) జీ7 దేశాలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకొస్తున్న ఒత్తిడికి జీ7 దేశాలు తలొగ్గినట్టు సమాచారం. భారత్, చైనాలపై సుంకాలను పెంచేందుకు జీ7 దేశాలు(G7 Countries) సూచన ప్రాయంగా అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.
Trump Tariffs | అమెరికా ఒత్తిడితో..
గ్రూప్-7 (జీ7)లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా భాగస్వాములు. ఆయా దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో వారి మధ్య సుంకాల(Tariffs) విధింపునకు సంబంధించిన చర్చ వచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించడానికి రష్యాపై ఒత్తిడి పెంచడానికి మరిన్ని చర్యలను చర్చించడానికి జరిగిన G7 సమావేశానికి కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపైన్(Francois-Philippe Champagne) అధ్యక్షత వహించారని రోలింగ్ G7 అధ్యక్ష పదవి అధిపతి కెనడా ఒక ప్రకటనలో తెలిపింది.ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు నిజంగా కట్టుబడి ఉంటే రష్యా నుంచి ముడి చమురు కొంటూ పరోక్షంగా సహాయం చేస్తున్న భారత్, చైనాలపై సుంకాలు విధించాలని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారు. ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తున్నట్టు తెలిపారు. పుతిన్ యుద్ధాన్ని ఆపాలంటే ఆర్థికంగా నియంత్రించడమే సరైన నిర్ణయమని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ తెలిపారు.
Trump Tariffs | అంగీకరించిన సభ్యదేశాలు..
అమెరికా ఒత్తిడి మేరకు భారత్(India), చైనా(China)లపై సుంకాలు విధించేందుకు ఆయా దేశాలు అంగీకరించినట్టు సమాచారం. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు తామంతా కట్టుబడి ఉన్నామని జీ7 దేశాల సభ్యులు తీర్మానం చేశారు. భారత్‌పై సుంకాల పెంపునకు సంబంధించి ఇప్పటివరకు జీ7 దేశాల నుంచి అధికారిక సమాచారం లేదు. అయితే, ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చడానికి స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించడానికి చర్చలను వేగవంతం చేయడానికి మంత్రులు అంగీకరించారు. రష్యాపై ఒత్తిడి పెంచడానికి విస్తృత శ్రేణి ఆర్థిక చర్యలు, రష్యా యుద్ధ ప్రయత్నాలకు వీలు కల్పించే వాటిపై మరిన్ని ఆంక్షలు, సుంకాలు వంటి వాణిజ్య చర్యల గురించి చర్చించారు. ఒకవేళ ఆయా దేశాలు కూడా సుంకాల పెంపునకు సిద్ధపడితే భారత్‌కు మరింత క్లిష్టపరిస్థితులు తప్పవు.