అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medak | మానవ సంబంధాలు మంట గలిసిపోయాయి. ప్రేమ, వివాహేతర సంబంధాల కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు.
ప్రస్తుత ఆధునిక సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పలువురు మహిళలు వివాహేతర బంధం మోజులో కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన పిల్లలను సైతం హత మారుస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా శివ్వంపేట (Shivampet) మండలం శభాష్‌పల్లి ఓ మహిళ తన రెండేళ్ల కుమార్తెను హత్య చేసి ప్రియుడితో పరారైంది.
Medak | భర్త ఫిర్యాదుతో..
శభాష్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మమత (22) మే 27 నుంచి కుమార్తెతో సహా కనిపించడం లేదు. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మమత గుంటూరు (Guntur)లో తన ప్రియుడు ఫయాజ్ (30)తో ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి వెంట రెండేళ్ల కూతురు కనిపించకపోవడంతో నిలదీశారు.
చిన్నారిని చంపి పాతిపెట్టినట్టు మమత, ఫయాజ్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. గ్రామ శివారులో చిన్నారిని పాతిపెట్టిన స్థలం వారు చూపెట్టగా.. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Medak | బిడ్డలను చంపుతున్నారు..
మొన్నటి వరకు ప్రియుడి కోసం కొంతమంది మహిళలు భర్తలను చంపారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం వెలుగు చూశాయి. అయితే తాజాగా సొంత బిడ్డలను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. తాత్కాలిక సుఖం కోసం పిల్లలను హత్య చేస్తున్నారు. ఇటీవల భూపాలపల్లి (Bhupalapally) జిల్లా చిట్యాల వడితల గ్రామంలో ఓ మహిళ తన భర్తను, 22 ఏళ్ల కూతురును హత్య చేసింది. ఇలాంటి ఘటనలు సమాజంలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.