అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nepal PM | నేపాల్‌లో ఉద్రిక్తతలు చల్లారాయి. దీంతో జెన్‌జడ్ ఉద్యమ కారులు తాత్కాలిక ప్రధానిని ఎంపిక చేశారు.
నేపాల్ తాత్కాలిక ప్రధానిపై ఉత్కంఠకు తెర పడింది. మాజీ సీజే సుశీల కర్కి (Sushila Karki)ని ప్రధానిగా ఎంపిక చేశారు. ఆమె ఎంపికపై జెన్-Z, ఆర్మీ, అధ్యక్షుడి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో అధ్యక్షుడు నేపాల్ పార్లమెంట్‌ను రద్దు చేశారు. మరికాసేపట్లో ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణం చేయనున్నారు.
Nepal PM | ఆందోళనలతో పడిపోయిన ప్రభుత్వం
నేపాల్ ఇటీవల రణరంగాన్ని తలపించిన విషయాన్ని తెలిసిందే. దేశంలో అవినీతి, సోషల్ మీడియాపై బ్యాన్ విధించడాన్ని వ్యతిరేకిస్తూ యువత పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రధాని, సహా మంత్రుల ఇళ్లపై దాడులు చేపట్టారు. ఈ క్రమంలో ప్రధాని కేపీ శర్మ ఓలి (KP Oli Sharma), మంత్రులు రాజీనామా చేశారు. అనంతరం ఆర్మీ (Army) రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబెట్టింది. ఈ క్రమంలో తాజాగా తాత్కాలిక ప్రధానిని ఎంపిక చేశారు.
Nepal PM | సుశీలా కర్కి నేపథ్యం
నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి (Chief Justice)గా సుశీలా కర్కి గుర్తింపు పొందారు. ఆమె జూన్ 7, 1952న మొరాంగ్ జిల్లాలోని బిరత్ నగర్లో జన్మించారు. మహేంద్ర మొరాంగ్ కళాశాల (Mahendra Morang College) నుంచి పట్టా పొందిన ఆమె.. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తరువాత నేపాల్లోని త్రిభువన్ విశ్వవిద్యాలయం (Ribhuvan University) నుంచి న్యాయ పట్టా పొందారు. జూలై 11, 2016 నుంచి జూన్ 6, 2017 వరకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన సుశీల అవినీతికి వ్యతిరేకంగా అనేక కీలక తీర్పులు వెలువరించారు.
Nepal PM | కీలక తీర్పులు
పోలీసు నియామకాలలో అక్రమాలు, ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు ఉన్నత స్థాయి అవినీతి కేసులపై సంచలన తీర్పులు ఇచ్చి సుశీలా కర్కి ప్రజల అభిమానం సంపాదించుకున్నారు. అయితే, 2017లో రాజకీయ పార్టీలు ఆమెపై అభిశంసన తీర్మానాన్ని తీసుకువచ్చాయి, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించాయి. అయితే, సుశీలకు మద్దతుగా ప్రజలు భారీ ఉద్యమం లేవదీయడంతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అభిశంసన తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నాయి.