అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | కస్టమ్ మిల్లింగ్ రైస్ అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను అమలు పరచాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తహశీల్దార్లను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిఫాల్ట్ రైస్ మిల్లులతో పాటు (rice mills) మిల్లర్లకు చెందిన ఆస్తులను బ్లాక్ చేయించాలని, అవసరమైతే ఆస్తులను వేలం వేసి సీఎంఆర్ నిధులను (CMR funds) రాబట్టే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎంఆర్ నిధులు పూర్తిస్థాయిలో రికవరీ కావాల్సిందేనని నిబంధనల ప్రకారం కఠిన చర్యలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇకనుంచి ప్రతి వారం సమీక్ష చేస్తానని ఎప్పటికప్పుడు ప్రగతి కనిపించాలని తెలిపారు. అంతకుముందు డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, వారి నుండి రావాల్సిన మొత్తం, ఇప్పటివరకు ఎంత రికవరీ చేశారనే వివరాలను రైస్ మిల్లర్ల వారీగా సంబంధిత మండల తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), డీఎస్వో రవీందర్ రెడ్డి, సివిల్ సప్లయ్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.