అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhupalapally | ఇసుక కోసం వాగులోకి వెళ్లిన వారిని వరద చుట్టు ముట్టింది. ట్రాక్టర్లు, కూలీలు వరదలో చిక్కుపోయారు.
రాష్ట్రంలో మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు ఉధృతంగా పారుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జయంశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల (Tekumatla) మండలం గర్మిళపల్లి-ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుకు శుక్రవారం ఉదయం వరద పోటెత్తింది. ఆ సమయంలో వాగులో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్లు, కూలీలు చిక్కుకుపోయారు.
Bhupalapally | ఇందిరమ్మ ఇళ్ల కోసం..
ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) కు ఇసుక కోసం శుక్రవారం ఉదయం 11 ట్రాక్టర్లు వాగులోకి వెళ్లాయి. కొద్దిరోజులుగా వాగులో వరద తక్కువగా ఉంది. దీంతో వాగులో పెట్టి ట్రాక్టర్లను లోడ్ చేస్తున్నారు. అయితే మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మానేరు వాగు (Manair Vagu)కు ఒక్కసారిగా వరద పోటెత్తింది. అప్పటికే రెండు ట్రాక్టర్లు లోడ్ నిండటంతో వాగులో నుంచి బయటకు వెళ్లాయి. మరికొన్ని ట్రాక్టర్లు వెళ్లడానికి సిద్ధం అవుతుండగా వరద ముంచెత్తింది. దీంతో వాగులో ఉన్న ట్రాక్టర్లు, కూలీలు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. కూలీలు ట్రాక్టర్లపైకి ఎక్కి తమను రక్షించాలని కేకలు వేశారు. వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Bhupalapally | కాపాడిన పోలీసులు
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వాగులో చిక్కుకున్న వారిని తాడు సాయంతో కాపాడారు. అయితే 9 ట్రాక్టర్లు మాత్రం కొట్టుకుపోయాయి. వాటిని బయటకు తీసుకు రావడానికి పోలీసులు, యజమానులు చర్యలు చేపట్టారు.
భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు
అకస్మాత్తుగా వరద పెరగటంతో గర్మిళ్లపల్లి వద్ద మానేరు వాగులో చిక్కుకున్న 9 ట్రాక్టర్లు, ఏడుగురు కూలీలు
వరదల్లో చిక్కుకున్న వారిని తాడు సహాయంతో బయటకు తీసుకువచ్చిన పోలీసులు. pic.twitter.com/YrY36q0YqR
— greatandhra (@greatandhranews) September 12, 2025