అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) మాట్లాడడం తగదని పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు షకీల్ పాషా (District President Shakeel Pasha) అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత అన్ని దుకాణ సముదాయాలను మూయిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆర్మూర్‌లోని (Armoor) యాసిన్ హోటల్‌ను మూయించామన్నారు. అయితే జీవన్ రెడ్డి తమ ప్రభుత్వం వచ్చాక పింక్ బుక్‌లో (pink book) పోలీసుల పేర్లు ఎక్కిస్తామంటూ హెచ్చరించినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తాము ఎలాంటి పక్షపాతం లేకుండా నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని వివరించారు. కానీ తమ ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడటం సరైంది కాదన్నారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కష్టపడి రాత్రింబవళ్లు విధులు నిర్వహించామని చెప్పారు.
Nizamabad City | సుప్రీంకోర్టు నిబంధనల మేరకే..
సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపిన నిబంధనల ప్రకారం డీజే హై వాల్యూంను నిషేధించడం జరిగిందని షకీల్ పాషా తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసును నమోదు చేశామన్నారు. అది కూడా విధి నిర్వహణలో భాగంగానే చేశామని.. ఎవరిమీద పక్షపాతం లేదన్నారు. పోలీసులను టార్గెట్ చేస్తూ కావాలని కేసులు నమోదు చేశారంటూ ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. సీనియర్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు రాజన్న, సోమనాథం, ఆనందరావు, సాయిలు, గంగాధర్, జై కిషన్, దత్తాత్రేయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.