అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Jupally | మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన ప్రజలు కంగుతినే రీతిలో సమాధానం చెప్పారు. వచ్చేసారి తాము అధికారంలోకి వస్తామో.. రామో తెలియదు. మీరు హామీ ఇవ్వమని అడిగితే ఎలా? అని ప్రశ్నించారు.
మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad District) గురువారం పర్యటించిన మంత్రి జూపల్లి బోథ్‌లో జరిగిన ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Minister Jupally | హామీలు ఎలా ఇవ్వాలి?
ఇక్కడే కాదు, తన సొంత నియోజకవర్గంలో కూడా ఎప్పుడు హామీలు ఇవ్వనని జూపల్లి స్పష్టం చేశారు. వచ్చేసారి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందన్న గ్యారంటీ లేదు కదా? అని అన్నారు. ‘‘వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ (Congress Party) గెలుస్తుందో లేదో తెలియదు! నేను కూడా మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు! అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వను’’ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తానని తెలిపారు. ఇక్కడే కాదు, నా నియోజకవర్గంలోనూ ఎవరికీ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తానని చెప్పారు.
Minister Jupally | వైరల్ అయిన వీడియో..
మంత్రి జూపల్లి (Minister Jupally) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను ప్రత్యర్థి పార్టీల నేతలు అన్ని ప్లాట్ ఫామ్‌లలో షేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల్లో ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో మంత్రి వ్యాఖ్యలే చెబుతున్నాయని పేర్కొంటున్నారు.