అక్షరటుడే, వెబ్డెస్క్: Nepal | తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకి పోయిన నేపాల్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అయితే, ఇటీవల జరిగిన విధ్వంసం సందర్భంగా భారత పర్యాటకులపైనా (Indian Tourists) దాడి జరిగింది. ఈ నెల 9న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విషయం తాజాగా బయటకు వచ్చింది.
భారత్ – నేపాల్ సరిహద్దులోని ఉత్తరప్రదేశ్లో గల సోనౌలి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సుపై (Tourist Bus) నేపాల్లో కొంతమంది నిరసనకారులు దాడి చేశారు. బస్సులో 49 మంది భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. నిరసనకారులు బస్సుపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఈ ఘటనలో మహిళలు, వృద్ధులు సహా అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని ఖాట్మండులో ఆస్పత్రిలో చేర్చారు.
Nepal | సురక్షితంగా ఇండియాకు..
ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత పర్యాటకులు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అప్పటికే నేపాల్లో జెన్ జడ్ నిరసనకారులు ఖాట్మండు సహా పలు ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించారు. అదే సమయంలో అటు వచ్చిన ఏపీ పర్యాటకుల బస్సుపై దుండగులు దాడి చేశారు. “మేము (పశుపతినాథ్ ఆలయంలో) దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వస్తుండగా, అకస్మాత్తుగా ఒక గుంపు మా బస్సును చుట్టుముట్టి కారణం లేకుండా దాడి చేసింది. ప్రయాణికులలో మహిళలు, వృద్ధులు ఉన్నారు, కానీ నిరసనకారులు పట్టించుకోలేదు” అని బస్సు డ్రైవర్ రాము నిషాద్ చెప్పినట్లు వార్తా సంస్థ PTI వెల్లడించింది. గాయపడ్డ పలువురిని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన భారత రాయబార కార్యాలయం (India Embassy) రంగంలోకి దిగింది. నేపాల్ ప్రభుత్వం సహాయంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో పర్యాటకులను సురక్షితంగా ఇండియాకు తరలించింది.
Nepal | నేపాల్ జనరల్ జెడ్ నిరసనలు
ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత నేపాల్ భగ్గుమన్నది. నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. దీంతో కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నిరసనకారులు, ఎక్కువగా యువత, ఇప్పుడు పార్లమెంటును రద్దు చేయాలని, ‘ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా’ రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు.
Nepal | విదేశీయుల తరలింపు..
ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండడంతో నేపాల్ ప్రభుత్వం (Nepal Government) దేశంలో చిక్కుకున్న విదేశీ పౌరులకు సౌకర్యాలు కల్పించడానికి తాత్కాలిక చర్యలను ప్రకటించింది. సెప్టెంబర్ 8 వరకు చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్న అంతర్జాతీయ ప్రయాణికులు ఇప్పుడు అదనపు రుసుములు చెల్లించకుండా ఎగ్జిట్ పర్మిట్లను పొందవచ్చని తెలిపింది. అలాగే వీసాలను క్రమబద్ధీకరించుకోవచ్చని నేపాల్ అధికారులు ప్రకటించారు. ఈ సౌకర్యం ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలలో, బయలుదేరే ప్రదేశాలలో అందుబాటులో ఉంటుంది.