అక్షరటుడే, కామారెడ్డి: Chinna Mallareddy | రైతులకు యూరియా (Urea) కష్టాలు తప్పడం లేదు. సొసైటీల వద్ద నిత్యం బారులు తీరుతున్నారు. యూరియా దొరకకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. గురువారం కామారెడ్డి పట్టణంలో (Kamareddy) రైతులు రోడ్డెక్కిన ఘటన మరువకముందే శుక్రవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో రైతులు ధర్నా నిర్వహించారు.
Chinna Mallareddy | తెల్లవారుజాము నుంచి క్యూలోనే..
గ్రామంలో రైతులకు సరిపడా యూరియా ఇవ్వడం లేదని, తెల్లవారుజామున నుంచి క్యూలో నిల్చుంటున్నామని రైతులు వాపోయారు. ప్రతిరోజు సొసైటీ చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా ఇస్తారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోరా సొసైటీ సిబ్బందిని నిలదీశారు.
యూరియా కోసం ఉదయాన్నే ముఖాలు కూడా కడుక్కోకుండా లైనులో నిల్చుంటున్నామని, గంటల తరబడి వేచి ఉంటే ఒక్కొక్క పాస్ పుస్తకానికి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే తమకు సరిపడా యూరియా కోసం ఎన్నిసార్లు సొసైటీల చుట్టూ తిరగాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తక్షణమే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.