అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bomb Threat | బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కారణంగా అత్యవసరంగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో శుక్రవారం రెండు హైకోర్టులలో గందరగోళం నెలకొంది. కోర్టు గదుల్లో పేలుడు పదార్థాలు అమర్చారని ఢిల్లీ, బాంబే హైకోర్టుకు బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో బాంబు పెట్టినట్లు సెక్యూరిటీ సిబ్బందికి మెయిల్ వచ్చింది. మధ్యాహ్నంలోగా కోర్టును పేల్చేస్తామని అందులో ఉంది. కోర్టులోని మూడు ప్రాంతాల్లో ఆర్డీఎక్స్లు అమర్చామని పేర్కొన్నారు. తమకు పాకిస్తాన్‌తో, ఐసిస్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు మెయిల్లో నిందితులు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు ఆవరణలో తనిఖీలు చేపట్టారు.
Bomb Threat | కోర్టు సేవలు నిలిపివేసి..
బాంబు బెదిరింపులతో కోర్టులోని జడ్జీలు, న్యాయవాదులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. న్యాయమూర్తులు కోర్టు సేవలను నిలిపివేశారు. కోర్టు ప్రాంగణం ఖాళీ చేయాలని భద్రతా సిబ్బంది (Security Staff) న్యాయవాదులు, సిబ్బందికి సూచించారు. అనంతరం పోలీసులు బాంబుస్క్వాడ్ (Bomb Squad) సాయంతో కోర్టు ఆవరణలో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చిన కొద్ది సేపటికి బాంబే హైకోర్టు (Bombay High Court)కు కూడా బెదిరింపులు రావడం గమనార్హం. దీంతో న్యాయమూర్తులు తమ బెంచీల నుంచి లేచి కోర్టు గదులను ఖాళీ చేయడంతో న్యాయవాదులు, సిబ్బందిని బయటకు వచ్చారు. అనంతరం కోర్టులో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
Bomb Threat | గతంలో సైతం..
ఇటీవల బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, మెయిల్స్ ఎక్కువయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఢిల్లీ, బెంగళూరులోని పలు స్కూళ్ల (Shools)కు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో సైతం పలు కోర్టుల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు ఫోన్లు చేశారు. ముఖ్యంగా విమానాలు, ఎయిర్‌పోర్టుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. పలు విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ కూడా చేశారు. అయితే ఇందులో చాలా వరకు ఫేక్ కాల్స్ ఉంటున్నాయి. దీంతో ప్రజలు, అధికారుల సమయం వృథా అవుతోంది.
ఈ మెయిల్స్ పంపిన వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే నిందితులు అంతర్జాతీయ IP అడ్రస్‌లు, వర్చువల్ ప్రాక్సీలు వాడుతున్నట్లు గుర్తించారు. దీంతో నిందితులు దొరకడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
#WATCH | Delhi | Delhi High Court receives a bomb threat via mail. Precautionary measures taken by the Delhi police and the court has been vacated. https://t.co/7mQhpAsLsU pic.twitter.com/IYOFFbna4n
— ANI (@ANI) September 12, 2025