అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma houses scheme) ఆశించిన మేర వేగంగా కొనసాగడం లేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోపు (local body elections) ఇళ్లను పూర్తి చేసి గఅహప్రవేశాలు కూడా పూర్తి చేయాలనే సంకల్పం నెరవేరనట్టు కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటికీ వేలాది సంఖ్యలో ఇళ్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. వివిధ కారణాలతో ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు.
జిల్లాలో మొత్తం 17,570 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో సుమారు పదివేల ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ పూర్తి చేశారు. 1,740 ఇళ్ల గోడలు పూర్తయ్యాయి. మరో 6,278 ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. ఇంకా 7,390 ఇళ్లు ఇప్పటికీ పారంభానికి నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా కేవలం 13 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంతవరకు అడపాదడపా నిర్మాణాలు కొనసాగుతున్నా.. నిజామాబాద్ (Nizamabad), ఆర్మూర్ (Armoor), బోధన్ (Bodhan) పట్టణాల్లో మాత్రం మందకోడిగానే కొనసాగుతున్నాయి.
Indiramma Housing Scheme | కలెక్టర్ పర్యవేక్షించినా..!
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రతీసారి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఆరాతీస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లినప్పుడు ప్రత్యక్షంగా ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. అయినా జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి కనబడటం లేదు. ప్రధానంగా బిల్లులు సమయానికి రాకపోవడం.. ఇసుక కొరత.. అంచనాకి మించి వ్యయం కావడం, అప్పులు పుట్టకపోవడం తదితర కారణాలతో పనులు నెమ్మదిస్తున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు.
Indiramma Housing Scheme | లబ్ధిదారులే అప్లోడ్ చేయాలి…
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన యాప్‌లో (Indiramma Housing Scheme app) ప్రభుత్వం కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. బిల్లుల కోసం ప్రతిపాదనలు పంపడంలో ఎదురవుతున్న జాప్యాన్ని నివారించేందుకు లబ్ధిదారులే నేరుగా చిత్రాలను అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది.
ఇంటి నిర్మాణాల దశల చిత్రాలను నేరుగా యాప్‌లో పంపించే సదుపాయం కల్పించడంతో ఇకపై అధికారుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యదర్శి, బల్దియాలో వార్డు అధికారి చిత్రాలను తీసి ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో అప్లోడ్ చేసేవారు. ఆ తర్వాత గృహ నిర్మాణ శాఖ (Housing Construction Department) ఏఈ లాగిన్‌కు.. అటు నుంచి డీఈ, పీడీ చివరగా కలెక్టర్ లాగిన్‌కు వెళ్తాయి. ఇలా దశల వారీగా రూ.5 లక్షలు లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమవుతాయి.