అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో నిత్యం లక్షలాది మందిని మెట్రో రైళ్లు గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. అయితే మెట్రో రైలును (Metro Train) తాము నడపలేమని ఎల్అండ్టీ కేంద్రానికి లేఖ రాసింది.
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో హైదరాబాద్ నగరంలో ఎల్అండ్టీ సంస్థ (L&T Company) మెట్రో రైలు నిర్మించింది. అయితే నష్టాలతో నిర్వాహణ తమతో కాదని సంస్థ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వహణ బాధ్యతను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఒకవేళ మెట్రో నిర్వాహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్‌ను ఏర్పాటు చేసినా తాము అప్పగిస్తామని చెప్పింది. వరుస నష్టాలతో పాటు, పేరుకుపోయిన బకాయిలతో మెట్రోను నడపలేమని తేల్చి చెప్పింది.
Hyderabad Metro | సరిపోని ఆదాయం
హైదరాబాద్ నగరంలో (Hyderabad City) ప్రస్తుతం మూడు మార్గాల్లో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. నిత్యం దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే టికెట్లు, యాడ్స్, లీజుల ద్వారా వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని ఎల్అండ్టీ పేర్కొంది. ఈ ప్రాజెక్టును కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తాజాగా సదరు సంస్థ లేఖ రాసింది.
Hyderabad Metro | కేంద్రం వివరణ కోరడంతో..
నగరంలో మెట్రో రెండో దశ పనులు వేగంగా చేపడుతున్నాయి. ఇప్పటికే భూ సేకరణ పూర్తి కాగా ఆయా మార్గాల్లో ఉన్న భవనాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో రెండో దశ డీపీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం (State Government) నుంచి కేంద్రం ఇటీవల వివరణ కోరింది. ఎల్అండ్టీతో చేసుకున్న ఒప్పందాలపై వివరాలు అడిగింది. ఈ క్రమంలో తాజాగా ఎల్‌టీ లేఖ రాయడం గమనార్హం.
Hyderabad Metro | బకాయిలు రూ.ఐదు వేల కోట్లు..
నగరంలో మెట్రో మొదటి దశ పనులు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభం అయ్యాయి. మెట్రో 2017లో ప్రారంభమైంది. 69 కిలోమీటర్ల మేర రూ.22 వేల కోట్లతో మెట్రో రైలు మార్గం నిర్మించారు. ప్రభుత్వం నుంచి ఎల్అండ్టీకి రూ.ఐదు వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. అంతేగాకుండా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం రైళ్ల నిర్వాహణకు సరిపోవడం లేదని సంస్థ చెబుతోంది. ఈ క్రమంలో మెట్రో నిర్వాహణ బాధ్యతను ఇతరులకు అప్పగిస్తామని ప్రకటించింది.