అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sachin Tendulkar | భారత క్రికెట్ పాలక సంస్థ బీసీసీఐ అధ్యక్ష పదవిలో కీలక మార్పులు జరగనున్నాయి. మొన్నటివరకు అధ్యక్షుడిగా ఉన్న రోజర్ బిన్నీ వయోపరిమితి (70 ఏళ్లు) కారణంగా పదవీకాలం ముగియడంతో, కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం బీసీసీఐ సిద్ధమవుతోంది.
సెప్టెంబర్ 28న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) కొత్త అధ్యక్షుడిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరు అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉందని ఇటీవల మీడియాలో బాగా చర్చకు వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు వైరల్ అయ్యాయి. సచిన్ బీసీసీఐకి (BCCI) నాయకత్వం వహిస్తే క్రికెట్‌కు మళ్లీ కొత్త ఊపొస్తుందని అభిమానులు అభిప్రాయపడ్డారు.
Sachin Tendulkar | స్పష్టం చేసిన ఎస్ఆర్‌టీ స్పోర్ట్స్
అయితే ఈ వార్తలపై సచిన్ టెండూల్కర్ నిర్వహణ సంస్థ SRT Sports Management Pvt. Ltd. స్పందిస్తూ.. “ఈ ప్రచారాలు పూర్తిగా నిరాధారమైనవే” అని స్పష్టం చేసింది. “సచిన్ పేరు బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేట్ చేశారన్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలు. సచిన్‌కు బీసీసీఐ పదవులపై ఆసక్తి లేదు. దయచేసి ఇలాంటి అపోహలను పట్టించుకోకండి,” అని సంస్థ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటనతో సచిన్ బీసీసీఐ అధ్యక్ష పదవిలోకి వస్తున్నారన్న ఊహాగానాలకు చెక్ పడినట్టయింది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్ పెద్దగా ప్రభుత్వ పదవులు లేదా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ పై ఎలాంటి ఆసక్తి చూపలేదు.
ఆయన ప్రధానంగా బ్రాండ్ అంబాసిడర్‌గా, కొన్నిసార్లు కామెంటేటర్‌గా మాత్రమే క్రియాశీలకంగా ఉన్నారు. క్రికెట్‌ను ప్రోత్సహించడమే తన లక్ష్యమని, పదవులపై ఆసక్తి లేదని సచిన్ అనేక సందర్భాల్లో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడితో పాటు అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్, ఐసీసీ (ICC) ప్రతినిధి వంటి కీలక స్థానాలకు కూడా ఎంపిక జరగనుంది. రోజర్ బిన్నీ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.