అక్షరటుడే, వెబ్డెస్క్ : Ilaiyaraaja | ప్రఖ్యాత సంగీత దర్శకుడు, మాస్ట్రో ఇళయరాజా గురువారం (సెప్టెంబర్ 11) కర్ణాటక ఉడుపి జిల్లాలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని(Mookambika Ammavari Temple) దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అమ్మవారికి రూ.4 కోట్ల(Rs.4 Crore) విలువైన వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించారు. అదేవిధంగా, వీరభద్ర స్వామికి వెండి కత్తి బహూకరించారు. ఆలయ అర్చకులు ఇళయరాజా(Ilaiyaraaja )తో కలిసి పూజలు నిర్వహించి, ఆయనకు తీర్థప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
Ilaiyaraaja | భక్తితో విలువలైన కానుకలు..
ఈ సందర్శనలో ఆయనతో పాటు కుమారుడు కార్తిక్ ,మనవడు యతీశ్ ఉన్నారు. ప్రస్తుతం కిరీటం, కత్తి సమర్పణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ జగన్మాత మూకాంబిక అమ్మవారి ఆశీస్సుల వలననే నా జీవితంలో ప్రతిదీ సాధ్యమైంది. నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు అని మీడియాతో ఇళయరాజా పేర్కొన్నారు. మూకాంబిక అమ్మవారిపై ఇళయరాజాకు గాఢమైన భక్తి ఉంది. తరచూ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. 2006లో కూడా అమ్మవారికి విలువైన కిరీటం సమర్పించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆలయ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ బాబు శెట్టి గుర్తు చేశారు.
గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇళయరాజా సినిమాల్లో అంతగా యాక్టివ్‌గా లేరు. కేవలం సెలెక్టివ్ ప్రాజెక్టులకు మాత్రమే సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, తన అనుమతి లేకుండా తన పాటలను వినియోగించిన వారిపై కాపీరైట్ కేసులు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల అజిత్ నటించిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” చిత్ర దర్శక–నిర్మాతలకు నోటీసులు పంపి, రూ.5 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఈ కేసులో కోర్టు కూడా ఇళయరాజాకు మద్దతుగా తీర్పునిచ్చింది. తెలుగులో ఇటీవలే ఓ చిత్రానికి సంగీతం అందించిన ఇళయరాజా, ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. వయస్సు పెరుగుతున్నా కూడా ఆయనకి పనిపై ఆసక్తి ఏ మాత్రం తగ్గడం లేదు.