అక్షరటుడే, వెబ్డెస్క్ : Jagdeep Dhankhar | నూతన ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారంలో ఓ వ్యక్తిపైనే అందరి దృష్టి నెలకొంది. ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లతో పాటు అక్కడున్న వారందరి చూపు ఆయనపైనే పడింది. ఆయన ఎవరో కాదు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్.
ఆకస్మిక రాజీనామా తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) తొలిసారి బహిరంగంగా కనిపించారు. సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) ప్రమాణ స్వీకారోత్సవంలో తళక్కున మెరిశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi), పార్టీ శ్రేణులకు అతీతంగా అగ్ర నాయకులు పాల్గొన్నారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ధన్‌ఖరే కావడం గమనార్హం.
Jagdeep Dhankhar | రాజీనామా అజ్ఞాతంలోకి..
2022 ఆగస్టులో భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన జగ్‌దీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆరోగ్య కారణాలను పేర్కొంటూ రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, వైద్య సలహాలను పాటించడానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు, తద్వారా తన రాజీనామా వెంటనే ఆమోదించాలని కోరారు. రాష్ట్రపతి రాజీనామాను ఆమోదించడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. మంగళవారం జరిగిన ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు.
Jagdeep Dhankhar | అనుమానాలెన్నో..
అయితే, ధన్‌ఖడ్ అనూహ్య రాజీనామాకు కారణాలు ఏమిటన్నది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఆయన.. తర్వాత బీజేపీలో చేరారు. ఆయన సమర్థత, నాయకత్వ శైలిని మెచ్చి కాషాయ పార్టీ గవర్నర్‌గా, ఉప రాష్ట్రపతిగా అవకాశాలు కల్పించింది. అయితే, గత జనవరి నుంచి బీజేపీకి, ఆయనకు మధ్య విభేదాలు చెలరేగాయని ప్రచారం జరిగింది. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పులపై ధన్‌ఖడ్ ముక్కుసూటిగా తన అభిప్రాయాలను వెల్లగక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అభిశంసన విషయంలో ప్రతిపక్షానికి మద్దతిచ్చేలా వ్యవహరించడంతో బీజేపీ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలో ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేశారు. బీజేపీ తన నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు మొదట్లో ఊహించినప్పటికీ, ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలనే తన ఉద్దేశాన్ని ధన్‌ఖడ్ అప్పట్లో స్పష్టం చేశారు. తనకు ఎంతో మద్దతునిచ్చిన రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, రాజీనామా చేసినప్పటి నుంచి కనిపించకుండా పోయినా ఆయన అప్పటి నుంచి మౌనం దాల్చారు.