అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల సమయంలో భద్రతా ప్రోటోకాల్స్ ఉల్లంఘించారని సెంట్రల్ రిజర్వ్ సెక్యూరిటీ ఫోర్స్ (Central Reserve Security Force) (సీఆర్పీఎఫ్) గురువారం వెల్లడించింది.
ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు (Congress President Mallikarjun Kharge) లేఖ రాసింది. రాహుల్ అనేక సందర్భాల్లో తప్పనిసరి రక్షణ చర్యలను పాటించడంలో విఫలమయ్యారని గుర్తు చేసింది. తరచూ ఇలా చేయడం వల్ల వీవీఐపీల భద్రతా ఏర్పాట్లను బలహీనపరుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇక నుంచైనా తన భవిష్యత్ విదేశీ పర్యటనల సమయంలో భద్రతా ప్రోటోకాల్స్ పాటించేలా చూడాలని హితవు పలికింది.
Rahul Gandhi | రాహుల్ గాంధీకి ‘Z+’ సెక్యూరిటీ..
లోక్ సభలో (Lok sabha) విపక్ష నేత రాహుల్ గాంధీకి పటిష్ట భద్రత ఉంటుంది. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ (ASL) కవర్తో ‘Z+’ భద్రతను ప్రభుత్వం కల్పించింది. 10 నుంచి 12 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ అతనితో ఉంటారు. ప్రొటోకాల్‌లో భాగంగా రాహుల్ పర్యటించే ప్రదేశాలు, భద్రతా ఏర్పాట్లను సీఆర్పీఎఫ్ సమీక్షిస్తుంది. ‘ఎల్లో బుక్’ ప్రోటోకాల్ (‘Yellow Book’ protocol) కింద, ‘Z+’ భద్రత ఉన్న వ్యక్తి.. భద్రతా సిబ్బందికి ప్రయాణ వివరాల గురించి కచ్చితంగా చెప్పాలి. కానీ, రాహుల్ తన విదేశీ పర్యటలన గురించి ఏమాత్రం సమాచారమివ్వడం లేదని సీఆర్పీఎఫ్ అసహనం వ్యక్తం చేసింది.
Rahul Gandhi | రాహుల్, కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు
లోక్ సభలో ప్రతిపక్ష నేత ‘ఎల్లో బుక్’ ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) రాహుల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. “రాహుల్ గాంధీ భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని సీఆర్పీఎఫ్ గుర్తుచేసింది. ఎల్లో బుక్ ప్రొటోకాల్ ప్రకారం హై-కేటగిరి భద్రతలో ఉన్న వ్యక్తులు విదేశీ ప్రయాణంతో సహా వారి కదలికల గురించి ముందస్తు సమాచారం అందించాల్సి ఉంటుంది. రాహుల్ అలా చేయడు” అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా (Amit Malviya) ‘ఎక్స్’లో విమర్శించారు.
మరోవైపు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి కూడా విపక్ష నేతపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎందుకు తన విదేశీ పర్యటనలను రహస్యంగా ఉంచుతున్నారని ‘ఎక్స్’లో ప్రశ్నించారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. “రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సమయంలో భద్రతా ప్రొటోకాల్ (security protocol) ఉల్లంఘనలను సీఆర్పీఎఫ్ గుర్తించడం చాలా తీవ్రమైన అంశం. ఈ అనుమానాస్పద విదేశీ పర్యటనల సమయంలో రాహుల్ గాంధీ ఎవరి ఆదేశాలను పాటిస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.