అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును బాగు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. చెరువు నీరు వృథాకాకుండా కాపాడుకునేందకు సిద్ధమయ్యారు.
ఇటీవల కురిసిన భారీవర్షాలకు (Heavy Rains) వరద ఉధృతికి తిమ్మాపూర్ గ్రామ చెరువు కట్ట, పంట కాల్వలు, మత్తడి కొట్టుకుపోయింది. ఆ గ్రామ శివారులోని పంటలకు ఆధారమైన చెరువు ధ్వంసం కావడంతో రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువు కింద వేసిన మొక్కజొన్న వరి పంటలకు నీరు లేకపోవడంతో చేతికొస్తున్న పంటలు దెబ్బతింటున్నాయని చెరువు, కట్ట మరమ్మతులు ప్రారంభించాలని సంబంధిత అధికారులు, నాయకులకు విన్నవించారు.
Yellareddy | ప్రతి ఇంటి నుంచి ఒకరు..
ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో, పంటలు ఎండిపోతాయేమోనని రైతన్నలు ఆందోళన చెందారు. అధికారులు పనులు చేసేవరకు వేచి ఉంటే తమ పంటలు దక్కవని భయాందోళనలతో గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి శ్రమదానంతో కట్టకు ఏర్పడిన బుంగను పూడ్చేందుకు శ్రమించారు. జేసీబీని ఏర్పాటు చేసి కాల్వల మరమ్మతులు.. చెరువు బుంగ పూడిక చేసేందుకు చేయిచేయి కలిపారు. కట్టనుండి మీరు వృథాపోతున్న నీటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు.
Yellareddy | 120 ఎకరాల్లో కొట్టుకుపోయిన పంటలు
ప్రస్తుత పంటకాలంలో 520 ఎకరాల్లో వరి, మక్క పంటలు వేశారు. అందులో 120 ఎకరాల్లో వరద ఉధృతికి పంట ధ్వంసమైంది. మిగిలిన పంటలు కీలక దశలో ఉండగా, నీటి సరఫరా నిలిచిపోవడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. పరిస్థితిని తట్టుకోలేక, రైతులే స్వయంగా చెరువు కట్టను పూడ్చే పనులు, కాలువ మరమ్మతులు చేసి నీటిని ఒడిసిపట్టేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
Yellareddy | నిధుల మంజూరైన నిర్లక్ష్యమేలా..?
వరదల అనంతరం పంటలు వాడిపోకుండా తక్షణమే నీటి సరఫరాను (Water Supply) పునరుద్ధరించాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. రూ. 9లక్షల వరకు మంజూరైన పనులు ప్రారంభించకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నాయకులు స్పందించకపోవడంతో తమ పంటలను రక్షించుకునేందుకు తామే కష్టపడుతున్నామని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Yellareddy | అధికారులు, నాయకులు స్పందించాలి..
రైతులు జిల్లా అధికారులు, నీటి పారుదల శాఖ(Irrigation Department) తక్షణం స్పందించి, చెరువు కట్ట పునరుద్ధరణ, కాలువ మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే వందల ఎకరాల పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని.. తమ జీవనోపాధిని కోల్పోయి తిండికి తిప్పలు అవుతాయని వాపోతున్నారు. చెరువు మరమ్మతు పనులను ప్రారంభించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మదన్మోహన్రావు, నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు పేర్కొంటున్నారు.